మళ్లీ టాప్‌‌లోనే ముఖేష్‌‌

మళ్లీ టాప్‌‌లోనే ముఖేష్‌‌

న్యూఢిల్లీ :  ఇండియాలో అత్యంత ధనవంతుడు ఎవరని అంటే… ఠక్కున రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ అధినేత  ముఖేష్ అంబానీ పేరు వస్తుంది. ఇప్పుడే కాదు… ఎప్పటి నుంచో ఆయన పేరు ఇలా మారుమోగిపోతూ ఉంది. తాజాగా ఐఐఎఫ్‌‌ఎల్ వెల్త్ హురున్ ఇండియా విడుదల చేసిన రిచ్‌‌ లిస్ట్‌‌లో కూడా ముఖేష్ అంబానీనే అగ్రస్థానంలో నిలిచారు. ఆయన ఇలా టాప్‌‌లో నిలవడం వరుసగా ఎనిమిదో సారి. రూ.3,80,700 కోట్ల సంపదతో ముఖేష్ అత్యంత ధనికుడి హోదాను మళ్లీ పొందారు. ఐఐఎఫ్‌‌ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌‌ పేరుతో ఈ రిపోర్ట్‌‌ను విడుదల చేసింది. ఈ లిస్ట్‌‌లో రెండో స్థానంలో లండన్‌‌కు చెందిన ఎస్‌‌పీ హిందూజా అండ్ ఫ్యామిలీ నిలిచింది. వీరి ఆస్తుల విలువ రూ.1,86,500 కోట్లు. ఆ తర్వాత రూ.1,17,100 కోట్లతో విప్రో వ్యవస్థాపకుడు అజిమ్ ప్రేమ్‌‌జీ మూడో ర్యాంక్‌‌ను సంపాదించారు. తాజాగా విడుదల చేసిన ఈ లిస్ట్‌‌లో… వెయ్యి కోట్లు పైగా నికర సంపద ఉన్న వ్యక్తుల సంఖ్య 953కి చేరింది. ఈ సంఖ్య 2018లో 831 గా ఉంది. అయితే అమెరికా డాలర్ల లెక్కన తీసుకుంటే, బిలీనియర్స్ సంఖ్య 141 నుంచి 138కు తగ్గింది. ఈ లిస్ట్‌‌లోని టాప్ 25 వ్యక్తుల మొత్తం సంపద మన దేశ జీడీపీలో 10 శాతానికి సమానంగా ఉంది. 953 అకౌంట్లను తీసుకుంటే, ఇది 27 శాతంగా నమోదైంది. ఆర్సిలార్‌‌‌‌మిట్టల్ ఛైర్మన్ ఎల్‌‌ఎన్ మిట్టల్‌‌ రూ.1,07,300 కోట్ల సంపదతో నాలుగో అత్యంత ధనవంతుడిగా పేరు సంపాదించారు. గౌతమ్ అదానీ 5వ స్థానంలో రూ.94,500 కోట్ల సంపద ఆర్జించినట్టు ఐఐఎఫ్‌‌ఎల్ వెల్త్ హురున్ రిచెస్ట్ లిస్ట్ పేర్కొంది.

యంగెస్ట్ సెల్ఫ్‌‌మేడ్ ఎంటర్‌‌‌‌ప్రిన్యూర్‌‌ రీతేష్

ఈ లిస్ట్‌‌లో 246 మందితో ఫైనాన్సియల్ క్యాపిటల్ ముంబై, ఇండియన్ టాప్ ఎంటర్‌‌‌‌ప్రిన్యూర్లకు నివాసంగా మారింది. 175 మంది న్యూఢిల్లీకి, 77 మంది బెంగళూరుకు చెందిన వారు కాగా, ఎన్‌‌ఆర్‌‌‌‌ఐలు 82 మంది ఉన్నారు. యంగెస్ట్ సెల్ఫ్‌‌మేడ్ ఎంటర్‌‌‌‌ప్రిన్యూర్‌‌‌‌గా ఓయో రూమ్స్ ఫౌండర్ రీతేష్ అగర్వాల్‌‌ రూ.7500 కోట్ల సంపదను ఆర్జించారు. 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో మీడియా.నెట్ దివ్యాంక టురాకియా(37) చోటు దక్కించుకున్నారు.

టాప్ 10లో ఉన్న ధనికులు

టాప్‌‌ 10లో ఉన్న మిగతా వారు… ఉదయ్ కొటక్‌‌ రూ.94,100 కోట్లతో 6వ స్థానంలో, సైరస్ ఎస్ పూనవాలా రూ.88,800 కోట్ల ఆస్తులతో 7వ స్థానంలో, సైరస్ పల్లోంజి మిస్త్రీ రూ.76,800 కోట్లతో 8వ స్థానంలో, షాపూర్జి పల్లోంజి రూ.76,800 కోట్లతో 9వ స్థానంలో, దిలీప్‌‌ సంఘ్వీ రూ.71,500 కోట్లతో 10వ స్థానంలో ఉన్నారు. అయితే ఆశ్చర్యకరంగా గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ధనికుల మొత్తం సంపద కేవలం 2 శాతమే పెరిగినట్టు ఐఐఎఫ్‌‌ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడించింది. 344 వ్యక్తుల సంపద ఈ ఏడాది తగ్గిపోగా.. మరో 112 మంది వెయ్యి కోట్ల సంపదను చేరుకోలేకపోయారని ఈ రిపోర్ట్ పేర్కొంది.