‘పాలమూరు’కు  ఎన్జీటీ బ్రేక్‌‌

‘పాలమూరు’కు  ఎన్జీటీ బ్రేక్‌‌
  • నవంబర్‌‌ 24  వరకు పనులను ఆపాలని ఆదేశం
  • తాగునీటి కోసమని.. ఇరిగేషన్​ ప్రాజెక్టు కడ్తున్నరు: ఏపీ 
  • ఆరేండ్ల కిందట్నే పనులు స్టార్ట్​ చేస్తే ఇప్పుడు పిటిషనేంది?: తెలంగాణ

హైదరాబాద్‌‌, వెలుగు: పాలమూరు–- రంగారెడ్డి ఎత్తిపోతలకు నేషనల్‌‌ గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌ (ఎన్జీటీ) బ్రేక్​ వేసింది. నవంబర్‌‌ 24 వరకు ప్రాజెక్టు పనులు చేపట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ లిఫ్ట్‌‌ స్కీంతో తమ రాష్ట్రంతో పాటు చెన్నై తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయని ఏపీలోని కడప జిల్లాకు చెందిన చంద్రమౌళీశ్వరరెడ్డి, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌‌ను ఎన్జీటీ చెన్నై బెంచ్‌‌ జ్యుడీషియల్‌‌ మెంబర్‌‌ జస్టిస్‌‌  కె. రామకృష్ణన్‌‌, ఎక్స్‌‌పర్ట్‌‌ మెంబర్‌‌ సత్యగోపాల్‌‌ శుక్రవారం విచారించారు.


పిటిషనర్ల తరఫున సీనియర్‌‌‌‌ అడ్వకేట్‌‌‌‌ పీఎస్‌‌‌‌ రామన్‌‌‌‌ వాదనలు వినిపించారు. ఈ ప్రాజెక్టుకు బచావత్‌‌‌‌, బ్రజేశ్‌‌‌‌ ట్రిబ్యునళ్లు ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదన్నారు. ఏపీ రీ ఆర్గనైజేషన్‌‌‌‌ యాక్ట్‌‌‌‌లోని 11వ షెడ్యూల్‌‌‌‌లోనూ ఈ ప్రాజెక్టును చేర్చలేదని చెప్పారు.  ఈ ప్రాజెక్టు నిర్మాణంతో రెండు రాష్ట్రాల్లో పర్యావరణంపై ప్రభావం పడుతుందన్నారు. శ్రీశైలం నుంచి 90 టీఎంసీలు తరలించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, తాగునీటి పేరు చెప్పి ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏఏజీ రామచందర్‌‌‌‌రావు మాట్లాడుతూ.. ఆరేండ్ల కిందట్నే తాము పనులు ప్రారంభించినా ఇప్పుడు పిటిషన్​ దాఖలు చేయడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయన్నారు. ఆలస్యంగా వేసిన పిటిషన్​కు విచారణ అర్హత లేదని చెప్పారు. ఈ వాదనను ఎన్జీటీ తోసిపుచ్చింది. ఏపీ అభ్యంతరాలు సరిగ్గానే ఉన్నాయని తెలిపింది. ఆయా అబ్జెక్షన్స్‌‌‌‌పై తెలంగాణ ఇచ్చిన సమాధానాలే సంతృప్తికరంగా లేవంది. ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ, పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేసింది. ప్రాజెక్టు పనులపై తాము ఏర్పాటు చేసిన ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ కమిటీ నివేదికపై నవంబర్‌‌‌‌ 24న వాదనలు వింటామని తెలిపింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు –- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు చేపట్టడానికి వీలు లేదని ఎన్జీటీ స్పష్టం చేసింది. నవంబర్‌‌‌‌ 24 వరకు పనులు నిలిపివేయాలని ఆదేశించింది.