జైకోవిచ్.. నొవాక్‌‌దే ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌

జైకోవిచ్.. నొవాక్‌‌దే ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌
  • ఫైనల్లో సిట్సిపాస్‌‌పై అద్భుత విజయం
  • కెరీర్‌‌లో 19వ గ్రాండ్‌‌స్లామ్ సొంతం
  • 4 గ్రాండ్‌‌స్లామ్స్‌‌ రెండేసి సార్లు నెగ్గిన ప్లేయర్​గా రికార్డు

నంబర్​ వన్‌‌ ప్లేయర్ ​నొవాక్ జొకోవిచ్‌‌ మళ్లీ మాయ చేశాడు..! ఈ ఎరాలో తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేశాడు..! ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ ఫైనల్లో ఖతర్నాక్‌‌ ఆటతో ఫ్యాన్స్‌‌ను కనువిందు చేశాడు..!  అనూహ్యంగా తొలి రెండు సెట్లు కోల్పోయినా.. తనకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో  పుంజుకున్న  జొకో ఆఖరాటలో అద్భుతం చేశాడు. తొలుత తన తడబాటుతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ సెర్బియా లెజెండ్.. మ్యాచ్ సాగుతున్న కొద్ది తిరుగులేని ఆటతో చెలరేగాడు..! 29 గ్రాండ్‌‌స్లామ్‌‌ ఫైనల్స్‌‌ ఆడిన తన అనుభవాన్ని రంగరిస్తూ.. క్లాసిక్‌‌ షాట్లతో అదరగొడుతూ.. తొలి గ్రాండ్‌‌స్లామ్‌‌ ఫైనల్‌‌ ఆడుతున్న  గ్రీస్‌‌ యంగ్‌‌స్టర్​ సిట్సిపాస్‌‌ పని పట్టాడు..! ఫలితంగా రోలాండ్‌‌ గారోస్‌‌లో రెండో టైటిల్‌‌, ఓవరాల్‌‌గా 19వ గ్రాండ్‌‌స్లామ్ సొంతం చేసుకున్నాడు..! స్విస్‌‌ గ్రేట్‌‌ రోజర్ ఫెడరర్, స్పెయిన్‌‌ బుల్‌‌ రఫెల్ నడాల్‌‌ (20 గ్రాండ్‌‌స్లామ్స్‌‌)ను అందుకునేందుకు మరొక్క అడుగు దూరంలో నిలిచాడు.! అంతకంటే ముఖ్యంగా 52 ఏండ్లలో నాలుగు గ్రాండ్‌‌స్లామ్‌‌ టైటిళ్లను రెండేసి సార్లు నెగ్గిన తొలి ప్లేయర్​గా రికార్డు సృష్టించాడు..! మరోవైపు తుదిపోరులో ఓడినా సిట్సిపాస్‌‌ తన పోరాటంతో ఆకట్టుకున్నాడు..! ఫస్ట్‌‌ టైమ్ ఓ మేజర్​ టోర్నీ ఫైనల్‌‌ బరిలో నిలిచినా.. ఎదురుగా వరల్డ్‌‌ నం. 1 జొకోవిచ్‌‌ ఉన్నా.. నిర్భయంగా ఆడిన అతనికి మంచి ఫ్యూచర్​ ఉంది..! 

పారిస్‌‌: ఫ్రెంచ్‌‌ కోటలో జోకర్ ​మరోసారి గర్జించాడు. క్లే కింగ్‌‌ నడాల్‌‌కు సెమీస్‌‌లో చెక్‌‌ పెట్టిన టాప్‌‌ సీడ్‌‌ నొవాక్‌‌ జొకోవిచ్.. తుదిపోరులో గ్రీస్‌‌ యంగ్‌‌ సెన్సేషన్​ స్టెఫనోస్‌‌ సిట్పిపాస్‌‌ విసిరిన చాలెంజ్‌‌లో నెగ్గాడు. ఆదివారం రాత్రి ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ ఫైనల్లో  34 ఏళ్ల జొకో 6–-7 (6/8), 2–-6, 6–-3, 6–-2, 6–-4తో ఐదో సీడ్‌‌ సిట్సిపాస్‌‌పై అద్భుత విజయం సాధించాడు. దాంతో, రోలాండ్‌‌ గారోస్‌‌లో ఐదేళ్ల తర్వాత సెకండ్‌‌ టైటిల్‌‌ నెగ్గాడు. 2016 ఫైనల్లో  తొలిసారి ఫ్రెంచ్‌‌ కిరీటం గెలిచాడు. నొవాక్ కెరీర్​లో ఇది 19వ మేజర్​టైటిల్. అలాగే, నాలుగు గ్రాండ్‌‌స్లామ్స్‌‌ను ఒకటి కంటే ఎక్కువ సార్లు గెలిచిన మూడో ప్లేయర్​గా రాయ్‌‌ ఎమర్సన్‌‌, రాడ్‌‌ లేవర్ సరసన నిలిచాడు.

తడబడి.. నిలబడి.. చెలరేగి..
సెమీస్‌‌లో క్లే కింగ్‌‌ రఫెల్‌‌ నడాల్‌‌పై అద్భుత విజయం సాధించిన జొకోవిచ్‌‌కు ఫైనల్లో గెలుపు అంత ఈజీగా రాలేదు. 4 గంటల 11 నిమిషాల ఫైట్‌‌లో 22 ఏళ్ల సిట్సిపాస్ తొలి రెండు సెట్లు నెగ్గి నొవాక్‌‌కు షాకిచ్చాడు. రిథమ్‌‌లోకి వచ్చేందుకు టాప్‌‌ సీడ్‌‌ చాలా ఇబ్బంది పడ్డాడు. అనవసర తప్పిదాలు చేయడంతో పాటు సర్వీస్‌‌తో పాటు రిటర్న్స్‌‌లో తేలిపోయాడు. అతని డ్రాప్‌‌ షాట్స్‌‌ కూడా గతి తప్పాయి. మరోవైపు స్టెఫనోస్‌‌ స్టార్టింగ్‌‌ నుంచే ఏస్‌‌లతో హడలెత్తించాడు. ఫస్ట్‌‌ గేమ్‌‌లో మూడు ఏస్‌‌లతో సర్వీస్ నిలబెట్టుకున్న అతను జొకోతో ఢీ అంటే ఢీ అన్నట్టు తలపడ్డాడు. 11వ గేమ్‌‌లో ఫస్ట్‌‌ బ్రేక్ పాయింట్‌‌ సాధించిన నొవాక్​ వెంటనే సర్వ్‌‌ కోల్పోవడంతో  సెట్‌‌ టై బ్రేక్‌‌కు దారి తీసింది. అక్కడ  ఓ డబుల్‌‌ ఫాల్ట్‌‌తో పాటు రెండు తప్పిదాలతో  వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయిన నొవాక్‌‌ వెంటవెంటనే మూడు విన్నర్లు కొట్టి 6–-5తో లీడ్‌‌లోకి వచ్చాడు. కానీ, మళ్లీ రెండు తప్పిదాలు చేయడంతో సెట్‌‌ సిట్సిపాస్‌‌ సొంతమైంది. సెకండ్‌‌ సెట్‌‌లో నొవాక్‌‌ ఆట మరింత గాడి తప్పింది.  గ్రీస్‌‌ ప్లేయర్​ రెండు అన్‌‌ఫోర్స్‌‌డ్​ ఎర్రర్స్‌‌  చేస్తే.. జొకో 10 అన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్స్‌‌, ఓ డబుల్‌‌ఫాల్ట్‌‌ చేశాడు. వీటిని యూజ్‌‌ చేసుకున్న సిట్సిపాస్‌‌ సర్వీస్‌‌తో పాటు పర్​ఫెక్ట్‌‌ విన్నర్లు కొడుతూ 35 నిమిషాల్లోనే సెట్‌‌ నెగ్గి ఓవరాల్‌‌గా 2–-0తో లీడ్‌‌ సాధించాడు. టైటిల్‌‌ నెగ్గాలంటే మిగిలిన మూడు సెట్లూ గెలవాల్సిన స్థితిలో నిలిచిన జొకో తనలోని బెస్ట్‌‌ ప్లేయర్​ను నిద్రలేపాడు. థర్డ్‌‌ సెట్‌‌లో చాలా కీలకమైన నాలుగో గేమ్‌‌లో బ్రేక్‌‌ సాధించాడు. ఈ గేమ్‌‌ ఏకంగా 11  నిమిషాలు పాటు సాగింది. సిట్సిపాస్‌‌ నాలుగు బ్రేక్‌‌ పాయింట్లను కాపాడుకోగా.. ఐదో ప్రయత్నంలో అతని సర్వీస్‌‌ బ్రేక్‌‌ చేసిన జొకో తర్వాత సర్వ్‌‌ నిలబెట్టుకొని  4–-1తో లీడ్‌‌లోకి వచ్చాడు. స్టెఫనోస్‌‌ 3-–5తో రేసులోకి వచ్చినా.. తొమ్మిదో గేమ్‌‌లో ఈ సెట్‌‌ నెగ్గి మ్యాచ్‌‌లో నిలిచాడు. అదే జోరుతో నాలుగో సెట్‌‌లో తొలి గేమ్‌‌లో బ్రేక్‌‌ సాధించాడు. ఆపై, 8 నిమిషాల పాటు సాగిన మూడో గేమ్‌‌లో పర్​ఫెక్ట్‌‌ విన్నర్​తో ఇంకో బ్రేక్‌‌ రాబట్టిన నొవాక్‌‌ వరుసగా నాలుగు పాయింట్లతో తర్వాతి గేమ్‌‌ నెగ్గి 4–-0తో లీడ్‌‌లోకి వెళ్లాడు. అదే ఊపుతో 8వ గేమ్‌‌లో సెట్‌‌ నెగ్గి ఓవరాల్‌‌ స్కోరు 2–-2గా మార్చాడు. చివరి సెట్‌‌ మూడో గేమ్‌‌లో  ఫస్ట్‌‌ బ్రేక్ పాయింట్‌‌ సాధించిన నొవాక్.. తర్వాత వరుసగా నాలుగు పాయింట్లతో నాలుగో  గేమ్‌‌ నెగ్గాడు. ఈ దశలో పోటాపోటీగా ఆడిన సిట్సిపాస్‌‌ మరో బ్రేక్‌‌కు అవకాశం ఇవ్వకుండా వరుసగా మూడు గేమ్‌‌లు కాపాడుకొని 4–-5తో పోటీలో నిలిచాడు. టైటిల్‌‌ కోసం జొకో సర్వ్‌‌ చేసిన పదో గేమ్‌‌లో అద్భుతమైన బ్యాక్​హ్యాండ్‌‌ విన్నర్​తో ఓ మ్యాచ్‌‌ పాయింట్‌‌ కూడా కాపాడుకున్నాడు. కానీ, 17 షాట్ల లాంగ్‌‌ ర్యాలీని ఫోర్​హ్యాండ్‌‌ విన్నర్​తో నెగ్గిన జొకో.. వెంటనే మరో విన్నర్​తో టైటిల్‌‌ కైవసం చేసుకున్నాడు.