సిటీలో ఎటు చూసినా పొల్యూషనే..శ్వాస సమస్యలతో జనం ఇబ్బందులు

సిటీలో ఎటు చూసినా పొల్యూషనే..శ్వాస సమస్యలతో జనం ఇబ్బందులు
  • ఫార్మాను సిటీ అవతలికి తరలిస్తామన్న సర్కార్ హామీలు ఉత్తమాటలే
  • ఇండస్ట్రియల్ వేస్టేజీతో జల వనరులు విషపూరితం
  • ప్రమాదకర వాయువులతో ఊపిరాడని పరిస్థితి
  • వెహికల్స్ తో విడుదలవుతున్న పొల్యూషన్ మరింత..

హైదరాబాద్, వెలుగువిశ్వనగరంగా రోజురోజుకు విస్తరిస్తున్న గ్రేటర్​ హైదరాబాద్.. ఇదే టైంలో పొల్యూషన్​ సిటీగా మారిపోతోంది. ఎక్కడ చూసినా చెత్త చెదారం, ప్రమాదకరమైన ఇండస్ట్రియల్​ వేస్టేజీ, ఊపిరి కూడా ఆడని స్థాయిలో విషపూరిత వాయువులు.. హైదరాబాద్​ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోడ్లపై చెత్త మొదలు డ్రైనేజీలు, నాలాలు, చెరువులు, కుంటలు, ఖాళీ జాగాలు, మూసీ నది దాకా అన్నీ ప్రమాదకరంగా మారుతున్నాయి. దీంతో ఏటా లక్షల మంది రోగాల బారినపడుతున్నారు. ఇండస్ట్రీల నుంచి వస్తున్న కెమికల్​ గ్యాసెస్, వెహికల్స్​ పొగ, దుమ్ము, ధూళితో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. సాలిడ్​ వేస్ట్​ మేనేజ్​మెంట్​ను పక్కాగా నిర్వహిస్తామని రాష్ట్ర సర్కారు, జీహెచ్ఎంసీ చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది.

గట్టి చర్యలేవీ?

కోటిన్నరకుపైగా జనాభా ఉన్న హైదరాబాద్ లో ప్రతిరోజు ఏడు వేల టన్నుల డొమెస్టిక్ వేస్టేజీ, జీవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో కొంత డంపింగ్​ యార్డులకు తరలిస్తున్నా మరెంతో వేస్టేజీ ఎక్కడిక్కడ కాలనీల్లో, డ్రైనేజీల్లో ఉండిపోతోంది. ఇక డంపింగ్​ యార్డులకు సమీపంలో అయితే పరిస్థితి నరకంగా మారింది. చెత్త రీసైక్లింగ్​ నామ్​కేవాస్తేగా జరుగుతోంది. ఇక ఫార్మా కంపెనీలు, ఇండస్ట్రీల్లో ఉత్పత్తయిన లిక్విడ్ వేస్టేజీని రూల్స్​ ప్రకారం సెంట్రల్ కెమికల్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించి శుద్ధి చేయాలి. కానీ ఇండస్ట్రీలు ఇదంతా ఖర్చు ఎందుకని.. కెమికల్స్​ను నాలాలు, డ్రైనేజీలు, చెరువులు, కుంటల్లోకి విడుదల చేస్తున్నాయి. దానివల్ల ఆయా పరిసర ప్రాంతాలతోపాటు భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. మరోవైపు సిటీలో ఉన్న ఇండస్ట్రీలు, ఫార్మా కంపెనీలను ఔటర్​ రింగ్​రోడ్డు అవతలికి తరలిస్తామని గత జీహెచ్ఎంసీ ఎన్నికల టైంలో టీఆర్ఎస్ సర్కారు హామీలు ఇచ్చింది. కానీ అమల్లోకి రాలేదు. మేడ్చల్ పరిధిలోని బాచుపల్లి, ఐడీఏ బొల్లారం, జీడిమెట్ల, పటాన్ చెరు, పాశమైలారం, కాజుపల్లి, మియాపూర్ వంటి ఏరియాల్లోని ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న కెమికల్ గ్యాస్ తో జనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

చెత్తంతా ఒకే దగ్గర..

గ్రేటర్​ హైదరాబాద్​తోపాటు మూడు మున్సిపాలిటీలకు కలిపి చెత్త కుండీలా జవహర్ నగర్ డంపింగ్ యార్డు తయారైపోయింది. 15 వేల కోట్ల టన్నుల చెత్తతో పెద్ద కొండలా మారింది. దాని నుంచి వెలువడే కుళ్లిన వాసన, రసాయనాల వాయువులు పది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న దమ్మాయిగూడ, కాప్రా, జవహర్ నగర్, కార్మిక నగర్, చీర్యాల, తిమ్మాయిపల్లి, ఈసీఐఎల్, కౌకూర్, యాప్రాల్, బండ్లగూడ, నాగారం, సాకేత్, అంబేద్కర్ నగర్ వంటి కాలనీల దాకా వ్యాపించి.. జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాత్రిపూట వెలువడుతున్న విష వాయువులతో ఒక్కోసారి ఊపిరికూడా ఆడటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో లక్షల మంది ఇబ్బంది పడుతుండటంతో.. కొత్త డంపింగ్‌‌ యార్డుల ఏర్పాటుకు జీహెచ్‌‌ఎంసీ ప్రతిపాదనలు చేసింది. జవహర్‌‌నగర్‌‌కు 50 కిలోమీటర్ల దూరంలో సిటీకి మూడు వైపులా డంపింగ్‌‌ యార్డులు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ కూడా ప్రకటించారు. ఇందుకోసం తలకొండపల్లి, కేశంపేట, రామేశ్వరబండ ప్రాంతాలను గుర్తించారు. కానీ అక్కడి స్థానికులు ఆందోళనలు చేయడంతో ఆపేశారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఇప్పటికే పూర్తిగా చెత్తతో నిండిపోయింది. అయినా ఇంకా తెచ్చి వేస్తూనే ఉన్నారు.

జనం రోగాల పాలైతున్నరు

ఎయిర్ క్వాలిటీపై జరిగిన స్టడీల్లో హైదరాబాద్​ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తేలింది. గతేడాదిలో బెంగుళూరుకు చెందిన సంస్థ.. అన్ని మెట్రో నగరాల్లో స్టడీ చేసి రిపోర్టు ఇచ్చింది. అందులో అందులో ఢిల్లీ 91శాతం పొల్యూషన్​తో మొదటి స్థానంలో ఉంటే.. తర్వాతి 76 శాతంతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ రెండు వేల మందిపై శాంపిల్​ హెల్త్​ స్టడీ చేయగా.. ఏదో ఒక శ్వాసకోశ ఇబ్బందితో బాధపడుతున్నవారు 55 శాతం, దీర్ఘకాలం తలనొప్పి, దగ్గు, ఆస్తమా వంటివాటితో బాధపడేవారు 45శాతం ఉన్నట్టు రిపోర్టులో పేర్కొన్నారు. గ్రేటర్​ హైదరాబాద్​లో ఏటా నీటి పొలుష్యన్ కారణంగా.. డయేరియా, హైపటైటిస్, జీర్ణ సంబంధ రోగాలతో వేల మంది బాధపడుతున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తన నివేదికలో తెలిపింది.

జాగ్రత్త పడకుంటే ప్రమాదమే..

గ్రేటర్​లో 70 లక్షలకు పైగా ఉన్న వెహికల్స్, రూల్స్​ పాటించని ఇండస్ట్రీలతో ఎయిర్​ పొల్యూషన్​ పెరిగిపోతోందని అర్బన్ ఎమిషన్ ఇన్ఫో సంస్థ వెల్లడించింది. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో పర్యావరణ కాలుష్య కారకాలపై స్టడీ చేసి గతంలో రిపోర్టు ఇచ్చింది. ప్రస్తుతం ఏటా దుమ్ము, ధూళి కణాలు (పీఎం2.5) 34 వేల టన్నుల మేర గాలిలోకి చేరుతోందని.. 4.5 లక్షల టన్నుల కార్బానిక్​ గ్యాసెస్, 4,850 టన్నుల సల్ఫర్ వాతావరణంలోకి చేరుతున్నాయని పేర్కొంది. పదేళ్లలో ఇది మూడింతలవుతుందని తెలిపింది. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు పెరుగుతారని హెచ్చరించింది.

కంట్రోల్ చేస్తలేరు

సిటీలో పొల్యూషన్​ కంట్రోల్​పై చర్యలు లేవు. రూల్స్ ​ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, జరిమానాలు విధించాలని పీసీబీ గతంలోనే ప్రతిపాదించింది. కానీ ఆచరణలోకి రాలేదు. జపాన్​లోని టోక్యోలో అమలవుతున్నట్టుగా క్లీన్ ఎయిర్ అథారిటీని ఏర్పాటు చేయాలి. పొల్యూషన్​ కంట్రోల్​ గైడ్​లైన్స్​ను అమలు చేయాలి.

– జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త