నా జర్నీలో ప్రతి అడుగు అందమైనదే: స్మిత

నా జర్నీలో ప్రతి అడుగు అందమైనదే: స్మిత

ప్రముఖ తెలుగు పాప్ సింగర్ స్మిత కెరీర్ ప్రారంభించి 20 ఏండ్లవుతోంది. ఈ సందర్భంగా ఈనెల 22న హైదరాబాద్ జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ లో ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్, టీజర్ ఆవిష్కరణ వేడుక మంగళవారం దసపల్లా హోటల్ లో జరిగింది. ఈ సందర్భంగా స్మిత మాట్లాడుతూ ‘‘నా జర్నీలో ప్రతి అడుగు అందమైనదే. 1996లో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు తొలిసారి ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో పాడాను. అప్పట్లో సీనియర్స్, జూనియర్స్ అని ప్రత్యేకమైన పోటీలు లేవు. అప్పుడు అందరిలో నేనే చిన్నదాన్ని. ఆ తర్వాత 1999లో నా తొలి ఆల్బమ్ విడుదలైంది. ఓవైపు నా కెరీర్ ప్రారంభమై అప్పుడే 20 ఏండ్లు అయ్యిందా అనిపిస్తోంది. మరోవైపు ఈరోజే నా తొలి అడుగు వేస్తున్నా అన్నట్టుగా ఉంది.

ఇక్కడి నుంచి మరింత ఎక్సయిటింగ్ జర్నీ మొదలవబోతోంది. ఈ నేపథ్యంలోనే 22న జె.ఆర్.సి కన్వెన్షన్ లో ఈవెంట్ జరపబోతున్నాం. సంగీతం, నృత్యం లాంటి కళలపై నాకున్న ప్రేమను వ్యక్తపరచడానికే ఈ కార్యక్రమం. నాకు లభించిన సపోర్ట్ ని మంచి పనులకు వాడతాను. ఈ సపోర్ట్ భవిష్యత్ లోనూ కొనసాగుతుందని ఆశిస్తున్నాను. నాగార్జున గారు నాకు మెంటర్. నన్ను కెరీర్ లో ఎంతో ప్రోత్సహించారు. నా మొదటి ఆల్బమ్ ‘సన్నజాజి పడక’ ఆయనే లాంచ్ చేశారు. మ్యూజిక్ స్కూలు కూడా ఆయనే ఓపెన్ చేశారు. మీరు లేకుంటే ఈవెంట్ చేయనని నాగార్జున గారికి చెప్పాను. ఆయన తప్పకుండా వస్తానన్నారు. నా సంగీత ప్రయాణంలో మరో కీలక వ్యక్తి కీరవాణి గారు. ఆయన కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో రాబోతున్నారు. జగపతిబాబు గారు, నాని, నరేష్ తో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరవనున్నారు. ఇది సినిమా ఈవెంట్ లా కాకుండా అంతకుమించి నా హృదయానికి దగ్గరైన ఈవెంట్ లా జరగబోతోంది. అదే వేదికపై ఒక పాట ఆవిష్కరణతో పాటు నా నెక్స్ట్ జర్నీ గురించి రివీల్ చేయబోతున్నాను. నేను ఈరోజు ఈ స్థానంలో ఉండటానికి కారణమైన అందరికీ థాంక్స్’’ అని చెప్పారు.