24 ఏళ్ల ఆటకు ఫెదరర్ గుడ్బై

24 ఏళ్ల ఆటకు ఫెదరర్ గుడ్బై

24 ఏళ్ల పాటు టెన్నిస్ కోర్టును ఏలిన రోజర్ ఫెదరర్ కన్నీటితో తన కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. రఫెల్ నాదల్ తో కలిసి లావెర్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్ కు గుడ్ బై చెప్పేశాడు. ఈ మ్యాచ్ లో ఫెడల్ జోడి ఓటమిపాలైంది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఫెదరర్ కంటతడి పెట్టారు. 

కన్నీళ్లతో తన ఆటకు వీడ్కోలు పలకకూడదని నిర్ణయించుకున్నానని మ్యాచ్ కు ముందు ఫెదరర్ చెప్పినా..అది సాధ్యం కాలేదు. ఫెదరర్ తో పాటు ఆయన స్నేహితుడు రఫెల్ నాదల్ కూడా ఎమోషనల్ అవడం చూసి స్టేడియం మొత్తం చిన్నబోయింది. ఈ సందర్భంగా ఫెదరర్ మాట్లాడుతూ.. తన భార్యకు థ్యాంక్స్ చెప్పాడు. ‘‘ఆమె అనుకుంటే నన్ను ఆడకుండా ఎప్పుడో ఆపేది. కానీ అలా చేయలేదు. నన్ను ఇన్నాళ్లు ఆడేలా ప్రోత్సహించిది. అన్ని వేళలా అండగా నిలిచింది’’ అని అన్నాడు. అదేవిధంగా తన టెన్నిస్ జర్నీ అద్భుతంగా సాగిందని..తాను సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. 

తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ఫెదరర్.  టెన్నిస్ ర్యాంకింగ్స్ లో 310 వారాల పాటు అగ్రస్థానాన నిలిచిన ఫెదరర్, 237 వారాల పాటు ఏకధాటిగా టాప్ లో ఉన్నాడు. 24ఏళ్ల ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ లో 103 సింగిల్స్ టైటిల్స్, 20గ్రాండ్ స్లామ్ టైటిల్స్ , 8 సార్లు వింబుల్డన్ టైటిల్స్ సాధించాడు. గత వారమే రిటైర్మెంట్ ప్రకటించిన ఫెదరర్ లేవర్ కప్ లో చివరి మ్యాచ్ ఆడాడు.