ఇయ్యాల్టి నుంచి బడులు... బదిలీలు, ప్రమోషన్లు లేవని టీచర్ల అసంతృప్తి  

ఇయ్యాల్టి నుంచి బడులు... బదిలీలు, ప్రమోషన్లు లేవని టీచర్ల అసంతృప్తి  
  • ఇయ్యాల్టి నుంచి బడులు..
  • క్లీనింగ్ కోసం కార్మికులను పెట్టని సర్కార్  
  • ప్రైవేట్​లో ఫీజుల  నియంత్రణకు చర్యల్లేవ్ 
  • బదిలీలు, ప్రమోషన్లు లేవని టీచర్ల అసంతృప్తి  
  • ఎండల తీవ్రతతో పేరెంట్స్ ఆందోళన 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సోమవారం నుంచి బడులు ప్రారంభం కానున్నాయి. 48 రోజుల సమ్మర్ హాలిడేస్ తర్వాత తిరిగి రీఓపెన్ కానున్నాయి. అయితే ఎండల తీవ్రత తగ్గలేదని పేరెంట్స్, టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ చాలా జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే టెంపరేచర్లు నమోదవుతున్నాయని, ఇలాంటి టైమ్ లో బడులు రీఓపెన్ చేయడమేంటని మండిపడుతున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఏపీలో ఒంటిపూట బడులు పెడుతున్నారని, మన రాష్ట్రంలోనూ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 వేలకు పైగా స్కూళ్లు ఉండగా, వాటిలో 60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. పోయిన విద్యాసంవత్సరం ఏప్రిల్ 24తో ముగియగా.. ఈ నెల 11 వరకు సమ్మర్ హాలీడేస్ ఇచ్చారు. సోమవారం నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లా కేంద్రాలకు పుస్తకాలు, యూనిఫామ్స్ పంపించారు.

ఈ వారంలోపే వాటిని పిల్లలకు అందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. కొన్ని జిల్లాల్లో యూనిఫామ్ కలర్ మారడంతో క్లాత్ వెనక్కి తీసుకున్నారు. అయితే వరుసగా మూడో ఏడాది యూనిఫామ్ కలర్ మార్చడం గమనార్హం. ఈ ఏడాది కలర్ తో పాటు డిజైన్ కూడా మారింది. దీంతో పాత యూనిఫామ్ పనికిరానట్టే. ఇక మూడేండ్లుగా చెబుతున్న రాగిజావను ఈ నెల 20 నుంచి అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.  

క్లీనింగ్ ఎట్ల? 

బడులు ఓపెన్ కానుండగా, అక్కడ క్లీనింగ్ పనులు చేసేందుకు మాత్రం స్వచ్ఛ కార్మికులు లేరు. దీంతో హెడ్మాస్టర్లు ఆందోళనలో ఉన్నారు. కరోనాకు ముందు సర్కారు బడుల్లో 28 వేల మంది స్వచ్ఛ కార్మికులు ఉండేవారు. వాళ్లకు నెలకు రూ.2,500 ఇచ్చి..  క్లాస్ రూమ్స్, టాయ్​లెట్లను క్లీన్ చేయించేవారు. అయితే కరోనా రావడంతో ప్రభుత్వం వాళ్లను తొలగించింది. ఇప్పటి వరకు తిరిగి నియమించలేదు. గ్రామాల్లో పంచాయతీ కార్మికులతో, పట్టణాల్లో మున్సిపల్ కార్మికులతో బడులు క్లీన్ చేయించుకోవాలని పోయినేడాది స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఎక్కడా ఈ ఉత్తర్వులు అమలు కావడం లేదు. ఈసారి కూడా మళ్లీ అవే ఉత్తర్వులు ఇచ్చే యోచనలో సర్కారు ఉంది. 

ఏపీలో ఒక్కపూట బడులు.. 


ఏపీలోనూ సోమవారం నుంచి బడులు ప్రారంభం కానున్నాయి. అయితే ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ నెల 17 వరకు ఒక్కపూట బడులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 7:30 నుంచి 11:30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని ప్రకటించింది. ఉదయం 9 గంటల్లోపు రాగి జావ, 12 గంటల్లోపు మధ్యాహ్నం భోజనం పెడతారు. బడులు 19 నుంచి రెండుపూటలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

ఫీజుల నియంత్రణకు చట్టమేదీ? 

కొత్త విద్యాసంవత్సరం మొదలవుతుండడంతో అటు పేరెంట్స్ ఆందోళనలో ఉండగా, ఇటు టీచర్లు అసంతృప్తితో ఉన్నారు. ప్రైవేట్ లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేరెంట్స్.. బదిలీలు, ప్రమోషన్లు చేపట్టడం లేదని టీచర్లు మండిపడుతున్నారు. వేసవిలోనే బదిలీలు, ప్రమోషన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆ తర్వాత షెడ్యూల్ రిలీజ్ చేసింది. అయితే బదిలీల్లో స్పౌజ్ పాయింట్లు కేటాయించడంపై కొందరు టీచర్లు కోర్టుకు వెళ్లారు. దీంతో ప్రక్రియ ఆగిపోయింది. అయితే స్టే తీసుకొచ్చి, ప్రక్రియ పూర్తి చేయాలని టీచర్ల సంఘాలు కోరినా సర్కారు పట్టించుకోలేదు. కనీసం అడ్​హక్​ ప్రమోషన్లు అయినా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదు. మరోపక్క స్పౌజ్ బదిలీల కోసం బాధిత టీచర్ల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక రాష్ట్రంలో దాదాపు10,800 ప్రైవేటు స్కూళ్లు ఉండగా.. వాటిలో 30 లక్షల మందికి పైగా చదువుకుంటున్నారు. అయితే ఈ బడుల్లో ఫీజుల నియంత్రణపై సర్కార్ పట్టించుకోవడం లేదు. ఫీజుల నియంత్రణ చట్టం తెస్తామని చెప్పినా, అది ఆచరణలోకి రాలేదు. కేబినేట్ సబ్ కమిటీ నుంచి ప్రతిపాదనలు తీసుకున్నా, ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.