గ్రేటర్ హైదరాబాద్ సంక్షిప్త వార్తలు

గ్రేటర్ హైదరాబాద్ సంక్షిప్త వార్తలు

ముషీరాబాద్, వెలుగు: ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.  దానికి పది వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. బుధవారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మూడో ఆవిర్భావ దినోత్సవ సదస్సు పాంప్లెంట్​ను ఫోరం ప్రతినిధులు ఆవిష్కరించారు.

అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఎంతో మంది తమ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఉద్యమం చేశారని గుర్తు చేశారు. వారికి జీవనోపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఉద్యమకారులను విస్మరించారని ఫైర్ అయ్యారు.  అధికారం రాగానే ఉద్యమకారులను మర్చిపోతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న కరీంనగర్​లోని ప్రెస్ క్లబ్-లో నిర్వహించనున్న సదస్సుకు 33 జిల్లాల నుంచి ఉద్యమకారులు అటెండ్ అవుతారని తెలిపారు. కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ సురేందర్ రెడ్డి, జంగా సుదర్శన్, వీరస్వామి, సాయన్న, ఇంద్ర కుమార్, విజయ్ కుమార్, రవీందర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

రూల్స్ పాటించని 15 హాస్పిటళ్లకు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: సిటీలో సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారుల ఆధ్వర్యంలో జిల్లా వైద్యారోగ్య శాఖ తనిఖీలు కొనసాగుతున్నాయి, రూల్స్ పాటించకుండా, తప్పుడు డాక్యుమెంట్లు ఉన్న క్లినిక్​లు, అర్హత లేని డాక్టర్లతో నడుస్తున్న హాస్పిటళ్లపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం జిల్లావ్యాప్తంగా 72  హాస్పిటళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఫైర్ సేఫ్టీ, బయో వేస్టేజ్ సర్టిఫికెట్లు, పర్మిషన్ లేకుండా నడుస్తున్న 15 హాస్పిటళ్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  

తొమ్మిది అంశాలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో బుధవారం స్టాండింగ్​కమిటీ సమావేశం జరగగా.. 9 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఆర్డీపీ కింద మల్లాపూర్ జంక్షన్ నుంచి శివ హోటల్ వరకు  60 మీటర్ల రోడ్డు వెడల్పు చేయడానికి 78 ఆస్తుల సేకరణ, అరవింద్ నగర్ వద్ద నిర్మించిన నాలాపై స్లాబ్ ను తొలగించి రూ. 2.99 కోట్ల వ్యయంతో బ్రిడ్జి పునర్నిర్మాణం,శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ వయా నల్లగండ్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి నుంచి బీహెచ్ఇఎల్ జంక్షన్ వరకు  150 మీటర్ల వెడల్పు రోడ్డు నిర్మాణంతో మరో ఆరు అంశాలకు కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,  స్టాండింగ్ కమిటీ సభ్యులు దేవేందర్ రెడ్డి, మహ్మద్ అబ్దుల్ సలాం షాహిద్, మహపర, మందగిరి స్వామి, కార్పొరేటర్ సామల హేమ, కమిషనర్ లోకేశ్ కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అధికారులు పాల్గొన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో మునుగోడులో పోటీ

ఖైరతాబాద్, వెలుగు: కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో మునుగోడులో పోటీకి దిగుతామని బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్ తెలిపారు. బుధవారం బీసీ రాజ్యాధికార సమితి ముఖ్య నాయకులతో కలిసి జల దృశ్యం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన లక్ష్మణ్​ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. తమ పోరాటాల కారణంగానే జలదృశ్యంలో లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటు చేశారన్నారు. బీసీ రాజ్యాధికార సమితి ముఖ్య సలహాదారులు నారగోని, కోర్ కమిటీ సభ్యుడు కుమారస్వామి , హరీశ్, ఉద్యమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

దళిత బంధులో ఎమ్మెల్యేల ప్రమేయం వద్దు

ముషీరాబాద్, వెలుగు: దళిత బంధు స్కీమ్​లో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తొలగించి.. క్షేత్రస్థాయి అధికారులతో అర్హులను ఎంపిక చేయించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంత్రి హరీశ్​రావును బుధవారం కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. దళితబంధు స్కీమ్ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగేవాళ్లకే దక్కుతుందని, అర్హులైన లబ్ధిదారులకు అందడం లేదన్నారు. 28న  ఇందిరా పార్కు దగ్గర మహాధర్నా నిర్వహిస్తామన్నారు.

ట్రాఫికర్​తో గల్లీల్లో జర్నీ

హైదరాబాద్, వెలుగు:  సిటీలోని మెయిన్ రోడ్లపై కి.మీ దూరం వెళ్లాలన్న 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది. ఇక10 నుంచి 15 కి.మీ ప్రయాణించాలంటే గంటకు పైనా పడుతుంది. ఈ క్రమంలో వాహనదారులు ట్రాఫిక్​లో ఇరుక్కోకుండా షార్ట్​కట్లు వెతుక్కుంటున్నారు. గల్లీలు, కాలనీల్లో నుంచి వెళ్తున్నారు. ఒక్కోసారి బైకులు, కార్లతోపాటు హెవీ వెహికల్స్ కూడా వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. సౌండ్, ఎయిర్ పొల్యూషన్‌‌‌‌, వెహికల్స్​రద్దీతో ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటే భయం వేస్తోందని చెబుతున్నారు. పరిస్థితిపై స్థానిక ట్రాఫిక్​పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. సమస్య ఎక్కువగా ఉన్నచోట పోలీసులు బారికేడ్లు పెట్టి, నో ఎంట్రీ అని సూచిస్తున్నారు. 

పెరిగిపోతున్న ఓన్​ వెహికల్స్

కోటికి పైగా జనాభా ఉన్న గ్రేటర్​సిటీలో 60 లక్షలకు పైగా వెహికల్స్ ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌పొర్టేషన్‌‌‌‌ వాడకం తగ్గడం, మెట్రోలో ట్రావెల్​చేయాలంటే స్టేషన్ వరకు వెళ్లేందుకు వెహికల్​అవసరం ఉండడం, షేరింగ్​ట్రాన్స్​పొర్టేషన్ ఎక్కేందుకు ఇంట్రస్ట్​లేకపోవడం ఇలా రకరకాల కారణాలతో చాలా మంది ఓన్ వెహికల్స్ వాడుతున్నారు. మెయిన్​రోడ్ల మీద ట్రాఫిక్​ఎక్కువగా ఉంటుండంతో గల్లీల్లోని షార్ట్​కట్లను ఎంచుకుంటున్నారు. ఆ ఎఫెక్ట్​కాలనీల మీద పడుతోంది. కనీసం ఇండ్ల ముందు నడిచే, కూర్చునే పరిస్థితి లేదని స్థానికులు వాపోతున్నారు. చాలా కాలనీల్లో పార్కులు ఉంటాయి. పిల్లలు, పెద్దలు అటూ ఇటూ తిరుగుతుంటారు. ఇలాంటి రోడ్లపైకి వెహికల్స్​ఎక్కువగా వస్తుండడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌‌‌‌పల్లి, గచ్చిబౌలి, ఇలా అనేక ప్రాంతాల్లోని కాలనీల్లో ఇదే పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద కాలనీలు, ఇండిపెండెంట్ విల్లాస్ ఉండే ప్రాంతాల్లో ఇప్పటికే నో ఎంట్రీ బోర్డులు, బారికేడ్లు పెట్టించారు. అయినప్పటికీ వెహికల్స్ ​సంఖ్య తగ్గడం లేదు. కొన్నిచోట్ల పోలీసులు ఫైన్లు కూడా వేస్తున్నారు.

బారికేడ్లు పెట్టాం

వెహికల్స్ రద్దీ పెరిగిందని కాలనీల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. పరిస్థితిని బట్టి బారికేడ్లు పెడుతున్నాం. ముఖ్యంగా రాత్రిళ్లు ఎక్కువ డిస్ట్రబెన్స్ ఉంటోందని గుర్తించాం. ఆ కాలనీల్లో బారికేడ్లు ఏర్పాటు చేశాం. కొన్ని  కాలనీల కూడళ్లలో సిబ్బందిని పెట్టి అబ్జర్వ్ చేయిస్తున్నాం. రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్లు వేస్తున్నాం.

‌‌‌‌‌‌‌‌- ట్రాఫిక్ పోలీస్‌‌‌‌, జూబ్లీహిల్స్

చాలా ఇబ్బందిగా ఉంటోంది

గతంలో కాలనీ రోడ్లు ఖాళీగా ఉండేవి. వెహికల్స్​చాలా తక్కువ తిరిగేవి. రష్​ఉండేది కాదు. కొన్నాళ్లుగా వెహికల్స్ పెరిగిపోయా యి. బైకులు, కార్లు స్పీడుగా వెళ్తున్నాయి. మెయిన్​రోడ్లపై ట్రాఫిక్​ను తప్పించుకునేందుకు కాలనీల్లోకి వస్తున్నట్లు తెలిసింది. దీంతో చాలా ఇబ్బందిగా ఉంటోంది. హారన్​సౌండ్లతోపాటు పిల్లలు, పెద్దలు రోడ్లు దాటాలంటే భయపడుతున్నారు.

- నీరజ, జర్నలిస్ట్ కాలనీ

45 మంది ఇన్‌‌‌‌స్పెక్టర్లు బదిలీ

హైదరాబాద్, వెలుగు: సిటీ పోలీస్ కమిషనరేట్‌‌‌‌ పరిధిలో 45 మంది ఇన్‌‌‌‌స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. జోన్ల వారీగా ట్రాన్స్‌‌‌‌ఫర్స్‌‌‌‌, పోస్టింగ్స్‌‌‌‌పై సీపీ సీవీ ఆనంద్‌‌‌‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌‌‌‌లో ఉన్న బదిలీలు, ఆరోగ్య పరిస్థితులు, సిబ్బంది వ్యక్తిగత కారణాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకున్నారు. ట్రాన్స్‌‌‌‌ఫర్స్ కోసం అప్పీల్‌‌‌‌ చేసుకున్న వారిని డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌కు అనుగుణంగా బదిలీ చేశారు. ఒకే చోట మూడేండ్లు సర్వీస్ పూర్తి చేసిన ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌వోలు, డీఐలను ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేశారు. కానిస్టేబుళ్లు, ఏఎస్‌‌‌‌ఐలు సహా మొత్తం 119 మందిని బదిలీ చేస్తూ సీపీ ఆదేశాలు ఇచ్చారు.

సిటీలో ఎల్లో అలర్ట్

సిటీలో బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత మొదలై హయత్ నగర్, దిల్ సుఖ్ నగర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, సరూర్ నగర్, కాప్రా ప్రాంతాల్లో దంచికొట్టింది. ఎల్​బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు విజయవాడ నేషనల్ హైవేపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఆటోనగర్, హరిణ వనస్థలి పార్క్, చింతలకుంట, వనస్థలిపురం, పనామా ప్రాంతాల్లో రోడ్లపై నడుము లోతున నీరు నిలిచింది. చింతలకుంటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​ముందు పార్క్​చేసిన కార్లు నీటమునిగాయి.

ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట, మాదాపూర్, హిమాయత్ నగర్ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్​నిలిచింది. నాగోలు అయ్యప్పనగర్ కాలనీలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. పీర్జాదిగూడలోని పలు కాలనీలను మూడ్రోజులుగా వరద నీరు చుట్టుముట్టింది. ఇండ్ల నుంచి బయటికి రాలేకపోతున్నామని స్థానికులు వాపోతు న్నారు. ఖైరతాబాద్​లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్ లోకి వరద నీరు చేరుతోంది. డ్రైనేజీ పనులు చేయకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇయ్యాల కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్లో అలర్ట్(6.4 నుంచి 11.5 సెంటీమీటర్ల వాన కురిసే చాన్స్) ప్రకటించారు. 

- వెలుగు, హైదరాబాద్/ఎల్ బీనగర్

కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి యువతి సూసైడ్

మాదాపూర్, వెలుగు: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి సూసైడ్ చేసుకున్న ఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. అబ్దుల్లాపూర్​మెట్ ప్రాంతానికి చెందిన స్వప్న(23)కు రెండేండ్ల కిందట పెళ్లైంది. భర్తతో విబేధాల కారణంగా విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గరే ఉంటోన్న స్వప్న డిప్రెషన్​తో బాధపడుతోంది. ఉంటుంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఎర్రగడ్డలోని మానసిక కేంద్రానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం నాగోల్​లోని కామినేని హాస్పిటల్​లో స్వప్న ట్రీట్​మెంట్ తీసుకుంటోంది. బుధవారం ఉదయం 10 గంటలకు స్వప్న తన సోదరి అంజితతో కలిసి కామినేని హాస్పిటల్​కు వచ్చింది. అక్కడ చెకప్ చేయించుకున్న తర్వాత  అంజిత ఆఫీసుకు వెళ్లగా..  స్వప్న ఇంటికి వెళ్తానని చెప్పి హాస్పిటల్ నుంచి బయలుదేరింది. కానీ ఆమె ఇంటికి వెళ్లకుండా నాగోల్​లో మెట్రో ట్రైన్ ఎక్కి హైటెక్ సిటీ స్టేషన్​కు చేరుకుంది.

అక్కడి నుంచి కేబుల్ బ్రిడ్జి వద్దకు వెళ్లింది. మధ్యాహ్నం 3.15 గంటలకు బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకింది.  లేక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బల్దియా డీఆర్ఎఫ్ బృందాలతో  కలిసి డెడ్​బాడీ కోసం గాలించారు.అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టిన స్వప్న డెడ్​ బాడీ దొరకలేదు. గురువారం మరోసారి గాలింపు చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.  అంజిత ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. డిప్రెషన్​తోనే స్వప్న ఆత్మహత్య చేసుందని కుటుంబసభ్యులు తెలిపారు. నామ్ కే వాస్తేగా పోలీస్ పెట్రోలింగ్ ఏడాది కాలంగా దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. కేబుల్​ బ్రిడ్జి వద్ద ఆత్మహత్యలను అడ్డుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు  వాచ్ టవర్​ ఏర్పాటు చేశారు.   కానీ పోలీసు సిబ్బంది పెట్రోలింగ్ చేసినట్లు కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 

పండుగలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి

హైదరాబాద్/గచ్చిబౌలి, వెలుగు: దేవీ నవరాత్రులు, బతుకమ్మ, మిలాద్ -ఉన్ -నబీ పండుగలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సిటీ సీపీ సీవీ ఆనంద్, సైబరాబాద్ ​సీపీ స్టీఫెన్​రవీంద్ర సూచించారు. ఆయా కమిషనరేట్ ఆఫీసుల్లో బుధవారం వారు సమీక్షలు నిర్వహించారు. డీసీపీ, ఏసీపీ, ఇన్‌‌‌‌స్పెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. పెట్రోల్, బ్లూ కోల్ట్స్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దుర్గామాత విగ్రహాల ఊరేగింపు, మిలాద్ ఉన్​నబీ వేడుకలకు సంబంధించి సూచనలు చేశారు. దసరా పండుగకు జనం ఊళ్లకు వెళ్తున్న నేపథ్యంలో రాత్రి వేళల్లో గస్తీ పెంచుతున్నట్లు తెలిపారు.