కెఎల్ఐ పెద్ద కాల్వకు గండి కొడుతున్నరు

కెఎల్ఐ పెద్ద కాల్వకు గండి కొడుతున్నరు
  • కుంటలోకి మళ్లించి పొలాలు ముంచుతున్నరు
  • కలెక్టర్​కు ఫిర్యాదు చేసిన బాధిత రైతులు

నాగర్​కర్నూల్​, వెలుగు: పక్కోడు ఎట్ల పోతే ఏం.. తమ భూముల్లో పంటలు పండితే చాలు అనుకున్నారేమో కొందరు బడా రైతులు ఏకంగా కేఎల్‌‌‌‌ఐ మెయిన్​ కెనాల్​కు గండి కొట్టారు.  అంతేకాదు భారీ పైపుల ద్వారా పేద రైతుల పట్టా పొలంలో ఉన్న కుంట నింపి.. వారికి పంట దక్కకుండా చేస్తున్నారు. దీనిపై  బాధిత రైతులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు.  వివరాల్లోకి వెళ్తే… బిజినేపల్లి మండలం మహదేవుని పేట గ్రామానికి చెందిన రైతులు మల్లికార్జున్​, కొండమ్మ, బోయ సామి, లక్ష్మమ్మ, వీరయ్య, బస్వరాజుకు సర్వే నెంబర్​ 54లో 18 ఎకరాల పట్టా భూమి ఉంది.  ఇందులోనే  కొంత భాగంలో గార్ల కుంట ఉంది.   వర్షాలు ఎక్కువగా కురిస్తే ఈ కుంట నిండడంతో పాటు వారి పొలాల్లోకి కూడా నీరు వస్తుంది. దీంతో రైతులు  వానాకాలంలో కూలీ పనికి వెళ్తూ.. ఎండాకాలంలో మాత్రం పంటలు సాగు చేసుకుంటున్నారు.

లాస్ట్‌‌‌‌ ఇయర్ కూడా..

ఇదే గ్రామానికి చెందిన కొందరు బడా రైతులు లాస్ట్‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌ కేఎల్‌‌‌‌ఐ మెయిన్​ కెనాల్​ నుంచి గార్ల కుంటలోకి నీటిని మళ్లించారు. అక్కడి నుంచి తమ పొలాల్లోకి నీళ్లు తీసుకెళ్లాలనేది వారి ప్లాన్‌‌‌‌.  కానీ, ఇలా చేయడంతో కుంట పక్కనున్న  రైతుల పంటలు మునిగి తీవ్రంగా నష్టపోయారు.  దీనిపై వారిచ్చిన ఫిర్యాదు మేరకు బిజి నేపల్లి ఆర్​ఐ ఫీల్డ్​ విజిట్​ చేసి నిజమేనని ధ్రువీకరించారు. ఆర్‌‌‌‌‌‌‌‌ఐతో పాటె ఎస్సై సైతం మరోసారి ఇలా చేస్తే చర్యలు తీసుంటామని హెచ్చరించి వదిలేశారు.   అయినా ఈ సారి ఏకంగా ప్రొక్లెయినర్​తో మెయిన్​ కెనాల్​కు గండి కొట్టారు.  అక్కడి నుంచి పైపులు వేసి గార్ల కుంట నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బాధితులు కలెక్టర్‌‌‌‌‌‌‌‌ను కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. తమకున్న కొద్దిపాటి పట్టా పొలాన్ని సాగు చేసుకోకుండా కుంటను నింపితే  జీవ నాధారం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.  గతంలో ప్రజావాణిలో  ఫిర్యాదు ఇవ్వగా రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్లు అడ్డుకున్నారనే కక్షతో  ఈసారి ఏకంగా కాల్వకే గండి కొట్టారని ఆరోపించారు. ఈ విషయాన్ని  ఇరిగేషన్​ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించు కోవడం లేదని వాపోయారు.  క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేసి  తమకు న్యాయం చేయడంతో పాటు  మెయిన్​ కెనాల్​ను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవి కూడా చదవండి 

పార్కును కబ్జా చేసి.. గోడ కడుతున్నరు

గ్రేటర్‌లో డీపీఎంఎస్ సేవలకు త్వరలో పుల్‌స్టాప్

అక్కడ రోడ్లపై చెత్త వేస్తే రూ. 5 వేలు ఫైన్    

చెరువుల కబ్జాలపై ఏం చేశారో రిపోర్ట్‌‌‌‌ ఇవ్వండి