ప్రతి వీధిలోనూ రామభక్తులే!: అసదుద్దీన్​ ఒవైసీకి నవనీత్​ రాణా కౌంటర్

ప్రతి వీధిలోనూ రామభక్తులే!: అసదుద్దీన్​ ఒవైసీకి నవనీత్​ రాణా కౌంటర్

ముంబై: దేశంలోని ప్రతి వీధిలోనూ రామ భక్తులు, మోదీ సింహాలు తిరుగుతున్నారని అమరావతి బీజేపీ ఎంపీ నవనీత్ రాణా అన్నారు. ఫిరంగిలాంటి తన తమ్ముడిని అదుపులో ఉంచుతున్నానంటూ ఎన్నికల ర్యాలీలో ఎంఐఎం చీఫ్​ అసదుద్దీన్​ చేసిన వ్యాఖ్యలకు ఆమె ట్విట్టర్​లో కౌంటర్ ఇచ్చారు. ‘‘మీ తమ్ముడిలాంటి ఫిరంగులను మా ఇంటిముందు అలంకరణలా వాడుతాం” అని చెప్పారు.  తాను త్వరలోనే హైదరాబాద్​కు వస్తున్నానని, దమ్ముంటే తనను ఆపాలని సవాల్ విసిరారు.

15 సెకన్ల సవాల్​తో మొదలైన మాటల యుద్ధం

ఇటీవల నవనీత్ రాణా హైదరాబాద్​లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత తరఫున ప్రచారం నిర్వహించారు. ఓ 15 సెకన్ల సమయం ఇస్తే ఒవైసీ సోదరులు ఎక్కడినుంచి వచ్చారో.. తిరిగి ఎక్కడికి చేరుకున్నారో తెలియకుండా చేస్తామని (2013లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఒవైసీ వ్యాఖ్యలకు కౌంటర్​గా) నవనీత్​ రాణా కామెంట్​ చేశారు. దీనిపై తాజాగా అసదుద్దీన్​ ఒవైసీ స్పందించారు. 15 సెకన్లు కాదు.. ఆమెకు గంట సమయం ఇవ్వాలని మోదీని కోరారు.

 బీజేపీ నేతలను చూసి తాము భయపడబోమని చెప్పారు. ‘నా తమ్ముడు ఫిరంగిలాంటివాడు. సన్​ ఆఫ్​ సలార్. నేనే అదుపుచేస్తున్నా. ఒక్కసారి వదిలిపెట్టమంటారా?’’ అని సవాల్ విసిరారు. దీనిపై నవనీత్ రాణా స్పందించారు. ‘‘మీ తమ్ముడు సన్​ ఆఫ్​ సలార్​ అయితే.. నేను సైనికుడి బిడ్డను.. ఎవ్వరికీ భయపడబోను” అని తెలిపారు. కాగా, ‘‘కాంగ్రెస్‌‌కు ఓటేస్తే పాకిస్తాన్​కు వేసినట్టే’’ అంటూ నవనీత్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం హైదరాబాద్​లో కేసు నమోదైంది. తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.