గ్రామ పంచాయతీలకు.. మరో రూ.640 కోట్ల నిధులు విడుదల

గ్రామ పంచాయతీలకు.. మరో రూ.640 కోట్ల నిధులు విడుదల
  •  2025–26కు సంబంధించి ఇంకా రూ.1,255 కోట్లు పెండింగ్
  • నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కేంద్రాన్ని కోరిన మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం శుక్రవారం గ్రామ పంచాయతీలకు మరో రూ.640 కోట్లు విడుదల చేసింది. ఇంతకుముందు కూడా కేంద్రం రూ.640 కోట్లు విడుదల చేయగా.. తాజా విడతతో కలిపి 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం బకాయిల చెల్లింపులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవసరమైన యుటిలిటీ సర్టిఫికెట్లు, ఇతర నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తున్నందున నిధుల విడుదల ప్రక్రియ వేగవంతమైందన్నారు. 

గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించిన పనులను పారదర్శకంగా, నిబంధనలకు తగ్గట్టుగా అమలు చేస్తున్నందుకు గుర్తింపుగా కేంద్రం ఈ నిధులను విడుదల చేసినట్టు తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సుమారు రూ.1,255 కోట్లు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ఆ నిధులు అత్యంత అవసరమని తెలిపారు.

 ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న నిధులను కూడా త్వరితగతిన విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 15వ ఆర్థిక సంఘం గడువు మరో 15 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో మిగిలి ఉన్న బకాయిలను ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని కేంద్రాన్ని ఆమె కోరారు.