ప్రయాణీకుల్లాగే ఆటోలో వస్తారు. డ్రైవర్ తో పాటు ప్యాసెంజర్లు కూడా వాళ్లే ఉంటారు. ఫలానా టౌన్ కు వెళ్తుందని, ఫలానా ఏరియాకు వెళ్తుందని చెప్పి ఎక్కించుకుంటారు. ఆ తర్వాత వెళ్లాల్సిన స్టాప్ వచ్చినప్పటికీ ఆటో ఆపరు. ఎవరూ లేని ప్రదేశాల్లోకి తీసుకెళ్లి దోపిడీ మొదలెడతారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దోపిడీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్నారు సూర్యాపేట జిల్లా పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం (మార్చి 14) వెల్లడించారు.
జిల్లా ఎస్పీ నరసింహ చెప్పిన వివరాల ప్రకారం.. ప్యాసెంజర్ల వద్ద బంగారం చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు సీసీఎస్ పోలీసులు. ఆటోలో ప్రయాణీకుల్లా నటించి జనాలను నిశ్శబ్ద ప్రదేశంలోకి తీసుకెళ్తారు. ప్యాసెంజర్ల ను బెదిరించి బంగారం చోరీలకు పాల్పడతారు.
►ALSO READ | రాంబాయి సినిమా తరహాలో ఘటన.. పెళ్లికి ఒప్పుకోలేదని యువతికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన యువకుడు
దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి రెండున్నర లక్షల విలువలైన18 గ్రాముల బంగారం , 1.5 కేజీల వెండి , 3 ఆటోలు , 1 బైక్ స్వాధీనం చేసుకున్నారు. గతంలో నిందితుల పై ఏపీ , తెలంగాణాలో 9 దోపిడీ కేసులు నమోదైనట్లు చెప్పారు ఎస్పీ. ఇలాంటి ఘటనల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
