కళా వైభవం: డిజిటల్ యుగంలో ఒగ్గు కథకు కొత్త గుర్తింపు... కళాకారులకు మంచి రోజులు వస్తాయా..!

కళా వైభవం: డిజిటల్ యుగంలో ఒగ్గు కథకు కొత్త గుర్తింపు... కళాకారులకు  మంచి రోజులు వస్తాయా..!

తెలంగాణ పురాతన సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే కొత్త తరానికి చేరువయ్యే ప్రయత్నంలో భాగంగా ఒగ్గు కళాకారులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఒగ్గు కథల కొత్త రూపాలను కళాకారులు ప్రదర్శిస్తూ డిజిటల్ ప్రపంచంలోని ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం పురాతన సంప్రదాయం – సాంకేతికతల మధ్య ఒగ్గు కథ ప్రయాణం సాగిస్తోంది.

ఒకప్పుడు ఊరూరా జాతరల్లో, దేవాలయాల ప్రాంగణాల్లో, రాత్రంతా సాగిన ఒగ్గు కథలు ఇప్పుడు కేవలం వేదికలకే పరిమితం కావడం లేదు.మారుతున్న సాంకేతికతతో పాటు ఈ కళ కూడా కొత్త దారులు వెతుక్కుంటోంది. పల్లె పల్లెనా ఒగ్గు కథలు చెప్పడమే కాకుండా తమ కళారూపాలను వీడియోలు తీయించి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ నుంచి ఫేస్ బుక్, యూట్యూబ్ ఇతర సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో పెడుతుండటంతో వీటికి క్రేజ్ పెరుగుతోంది. 

పాత ఒగ్గు కథల వీడియోలు వైరల్ అవుతుండగా, యువ కళాకారులు చిన్న నిడివి వీడియోల రూపంలో కొత్త ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. ఫలితంగా ఒగ్గు కథలకు కొత్త గుర్తింపు లభిస్తోంది. యువత ఈ వీడియోలను ఆసక్తిగా వీక్షిస్తోంది. దీంతో కళాకారులకు కొత్త అవకాశాలు, ప్రైవేట్ ఈవెంట్లు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆహ్వానాలు పెరుగుతున్నాయని కళాకారులు చెప్తున్నారు. అయితే సంప్రదాయ కథలు గంటల తరబడి సాగుతుంటే, సోషల్ మీడియా కోసం వాటిని కొన్ని నిమిషాలకు కుదించాల్సి వస్తోందని అంటున్నారు. 

ఏమిటీ ఒగ్గు కథ?

ఒగ్గు కథ తెలంగాణ ప్రాంతానికి చెందిన అత్యంత ప్రాచీనమైన జానపద కళారూపం. శివుని చేతిలోని ఢమరుకాన్ని పోలిన ‘ఒగ్గు’ అనే వాయిద్యాన్ని ఉపయోగించి కళాకారులు పల్లెల్లో కథలు చెప్తుంటారు. సంగీతం, తాళవాద్యాలతో కూడిన మౌఖిక కథనం ఈ ఒగ్గు కథ కళారూపం.వందేళ్ల జీవితాన్ని ఒక్క రోజు చెప్పేదే ఒగ్గు కథ. కథకులు కామెడీ కథలతో అదరగొడుతుంటారు.

కురుమ, యాదవ కులాలకు చెందిన కళాకారులు ఎక్కువగా ఈ కళను ప్రదర్శిస్తున్నారు. వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లోని ఒగ్గు కథ కళాకారుల బృందాలు ఎక్కువగా ఉన్నాయి. శక్తివంతమైన కథనం, లయబద్ధమైన సంగీతం, ఉత్సాహభరితమైన ప్రదర్శనలతో ఒగ్గు కథ తెలంగాణలో అత్యంత విశిష్టమైన జానపద కళారూపాల్లో ఒకటిగా నిలిచింది.ఒగ్గు కథా కళా టీంలో అయిదుగురు కళాకారులుంటారు. స్త్రీ వేషంలో ఓ కళాకారుడు, యేటిగా, డప్పు, తాళం వేసే కళాకారులు, కామెడీని రక్తికట్టించే కళాకారులు ఉంటారు. 

ఎక్కడ ప్రదర్శిస్తారంటే..

పల్లెల్లో రేణుకా ఎల్లమ్మ, పెద్దమ్మతల్లి, మల్లికార్జునస్వామి, మడేలయ్య జాతరల్లో, మరణించిన వారికి స్వర్గం ప్రాప్తించాలని కోరుతూ వారి ఆత్మ శాంతి కోసం దశదిన కర్మలు, సంవత్సరీకాల్లో వారి ఫొటోలు పెట్టి ఒగ్గు కథలు చెప్పిస్తుంటారు. తరతరాలుగా ఆలయ ఉత్సవాలు, గ్రామ సమావేశాల్లో ప్రదర్శిస్తూ వస్తున్నారు.

ఒగ్గు కథల కళారూపాలెన్నో.. 

తెలంగాణ జానపద కళల్లో అత్యంత ప్రాచీనమైన ఒగ్గు కథలో మల్లన్న, బీరప్ప, ఎల్లమ్మ వంటి జానపద దేవతల చరిత్రలను గానం, సంభాషణ, నృత్యం, సంగీతం సమ్మిళితంగా వినిపిస్తుంటారు.ఈ కథల రూపాల్లో వందకు పైగా ఉన్నాయి. 

అరుణావతి, కరుణావతి, ఎరుకల నాంచారి, నల చక్రవర్తి, సత్యహరిశ్చంద్ర, సంధ్యారాణి ఒగ్గు కథలు ప్రాచుర్యం పొందాయని ఒగ్గు కథ కళాకారుడు భూతం మల్లేశం చెప్పారు. సంప్రదాయ పురాణ కథలతో పాటు సామాజిక అంశాలపై కూడా ఒగ్గు కథలు రూపొందుతున్నాయి.

 పర్యావరణ పరిరక్షణ, బాల్యవివాహాల నిర్మూలన, మత్తు పదార్థాల వ్యసనం, ఓటు హక్కు, మహిళా సాధికారత, డిజిటల్ అవగాహన వంటి అంశాలను ఒగ్గు కథల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ శాఖలు కూడా అవగాహన కార్యక్రమాల్లో ఈ కళను వినియోగిస్తున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల కోసం కథ చెప్పే విధానంలో మార్పులు చేశారు.

రాత్రంతా ఒగ్గు కథల గానం

పల్లెల్లో వేడుక ఏదైనా సాధారణంగా ఒగ్గు కథను భోజనాలు అయ్యాక రాత్రి 9 గంటలకు కళాకారులు ప్రారంభిస్తారు. అలా రాత్రంతా కథలు చెప్తూనే ఉంటారు. ఒక్కోసారి తెల్లవారుజామున 4 గంటల యినా ప్రేక్షకులు అలాగే కూర్చుండి పోతారని పెద్దపల్లి జిల్లా మంగపేట గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారుడు దొడ్ల మల్లన్న చెప్పారు. తమకు రాత్రంతా ఒగ్గు కథా గానం చేస్తే రోజుకు రూ.10 వేల నుంచి15వేల రూపాయల దాకా ఇస్తారని చెప్పాడు. ఒగ్గు కథలపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కూడా జరిగాయి.

ఒగ్గు కథకు వన్నె తెచ్చిన కళాకారులు

తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మిద్దె రాములు ఒగ్గు కళను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లి ఒగ్గు కథ చక్రవర్తి, జానపద కళాబ్రహ్మగా పేరొందారు. ఈయన ఒగ్గు కథలను 200 సార్లు ఆకాశవాణి, దూరదర్శన్​లలో ప్రదర్శించారు. మరో ప్రముఖ ఒగ్గు కథ కళాకారుడు చుక్క సత్తయ్య12వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. జానపద కళారంగానికి చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం నుంచి సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. 

ఒగ్గు కథ పితామహుడు వల్లం పెద్ద వీరయ్య కుమారుడైన వల్లం సత్తయ్య కొమురవెల్లి మల్లన్న, ఎల్లమ్మ కథలను ప్రాచుర్యంలోకి తెచ్చారు. మహిళా కళాకారిణులు కూడా ఉన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన జమ్మ మల్లరి ఒగ్గు కథ చెప్తున్న అతికొద్ది మంది మహిళా కళాకారిణుల్లో ఒకరుగా నిలిచారు. బాలాసైదులు, శైల రాజమల్లయ్య, ఒగ్గు రవి తదితరులు ఈ కళను నేటి తరానికి అందిస్తున్నారు.

ఎందరో ఒగ్గు కథకులు..

తెలంగాణలో దొడ్ల మల్లన్న, రొంపికుంట కుమార్ యాదవ్, జగన్ యాదవ్, ఒగ్గు కథ మహేష్, సల్పల సతీష్ యాదవ్​లు ఉన్నారు. నాగదేవి ఒగ్గు కథతో ఈంబడి శ్రీనివాస్ పేరొందారు. గోల్కొండ చరిత్రతో కలిసిన గొప్ప ఒగ్గు గానం చేసిన భూతం మల్లేశం ప్రేక్షకుల ప్రశంసలందుకున్నారు. ఎల్లమ్మ కొడుకుల ఒగ్గు కథను సతీష్ టీం చెప్తుంది. 

కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన జానపద కళాకారులు రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నారంటే తెలంగాణ జానపద కళల ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ పురాతన ఒగ్గు కథ కళారూపాలకు ప్రభుత్వం ప్రోత్సాహమిచ్చి ఈ కళ అంతరించి పోకుండా పరిరక్షించాలని ఒగ్గు కళాకారులు కోరుతున్నారు. ఒగ్గు కథ కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు.. ఇది సంగీతం, కథనం, నాటకం ద్వారా చరిత్ర, విశ్వాసం, జానపద కథలను పరిరక్షించే ఒక సజీవ సంప్రదాయం. 

ఒగ్గు కథే జీవనాధారం..

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చెందిన నర్రా సతీష్ యాదవ్ స్త్రీ వేషధారణతో ఒగ్గుకథనే వృత్తిగా స్వీకరించి జీవనాధారంగా కొనసాగిస్తున్నారు. తాను చిన్ననాటి నుంచి ఈ కళను నేర్చుకున్నానని ఆయన చెప్పారు. 2003వ సంవత్సరం నుంచి పల్లె పల్లెనా  పలు వేదికలపై ఒగ్గు కథ కళారూపాలను ప్రదర్శిస్తూ ఉత్తమ ఒగ్గు కథకుడిగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలను నర్రా సతీష్ యాదవ్ అందుకున్నారు. 

తెలంగాణ ఉద్యమంలోనూ తన కళారూపంతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. రాష్ట్ర సమాచారశాఖ నుంచి ప్రశంసాపత్రాలను పొందారు. శాతవాహన కళోత్సవాల్లో ఈయన పలు అవార్డులు సాధించారు. 2015 తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో ఒగ్గు కథా కళాకారుడిగా స్టేట్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఈయనకు గ్రామీణ కళాజ్యోతి అవార్డు, కరీంనగర్ ఫోక్స్ అకాడమీ అవార్డులు దక్కాయి. డిపార్టుమెంట్ ఆఫ్ కల్చరల్ అకాడమీ, అన్నమయ్య కల్చరల్ అకాడమీల నుంచి జాతీయ స్థాయి ఫోక్ ఫెస్టివల్​లో ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ featureseditor@v6velugu.com