అయ్యో..అంత కష్టం ఎందుకొచ్చిందో..చనిపోతాం..అనుమతివ్వండి.. మిర్యాలగూడ RDOకు వృద్ధ దంపతుల వినతి

అయ్యో..అంత కష్టం ఎందుకొచ్చిందో..చనిపోతాం..అనుమతివ్వండి.. మిర్యాలగూడ RDOకు వృద్ధ దంపతుల వినతి
  • ఆస్తి కోసం కొడుకులు వేధిస్తున్నారని ఫిర్యాదు

మిర్యాలగూడ, వెలుగు: కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని, లేదంటే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వృద్ధ దంపతులు మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డిని ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మీడియాకు వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన గగ్గనపల్లి బుచ్చిరెడ్డి, అనసూయ దంపతులు తమ ఆస్తిని ఇద్దరు కొడుకులకు సమానంగా పంచారు. 

వృద్ధాప్యంలో వైద్య ఖర్చుల కోసం ఉంచుకున్న 3 ఎకరాల 11 గుంటల భూమిని తమను పోషిస్తున్న మనవడికి రిజిస్ట్రేషన్ చేయగా, ఆ భూమిలోనూ వాటా కావాలని పెద్ద కొడుకు శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా వేధిస్తున్నారు. ఆస్తి వివాదంలో గతంలో వీల్‌‌చైర్‌‌లో ఉన్న తనపై పెద్ద కోడలు చెప్పుతో దాడి చేసిందని, ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని వారు తెలిపారు. 

దీనిపై వేములపల్లి పోలీస్‌‌స్టేషన్‌‌లో కేసు నమోదైనా వారి తీరు మారలేదన్నారు. కేసు ఉపసంహరించుకోవాలని, లేకపోతే ట్రాక్టర్‌‌తో తొక్కిస్తామని బెదిరిస్తున్నారని వృద్ధ దంపతులు ఆరోపించారు. ఈ విషయమై మరోసారి పోలీసులను ఆశ్రయించినా చర్యలు తీసుకోలేదని, పైగా తమనే దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. 

దీంతో మిర్యాలగూడ ఆర్డీవోను కలిసి తమకు రక్షణ కల్పించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమకు న్యాయం చేయలేకపోతే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని రోదిస్తూ వినతిపత్రం సమర్పించారు. విచారణ జరిపి తగిన న్యాయం చేస్తామని ఆర్డీవో హామీ ఇచ్చి వారిని ఓదార్చారు.