తెలంగాణలోని ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బ్యారేజ్, గౌరవెల్లి రిజర్వాయర్ పర్యావరణ అనుమతులు సురక్షితమని సర్వోన్నత ధర్మాసనం స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.
కేంద్ర OM కొట్టివేత
కేంద్ర పర్యావరణ శాఖ 2021 నాటి ఆఫీస్ మెమోరాండం (OM)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే ఈ తీర్పును భవిష్యత్తు వర్తింపు విధానంలో అమలు చేయాలని ఆదేశించింది. దీనివల్ల గతంలో 2021 ఓఎం ద్వారా పొందిన అనుమతులన్నీ పూర్తిస్థాయిలో చెల్లుబాటులో ఉంటాయని, ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులకు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేసింది.
చట్టబద్ధతపై కోర్టు వ్యాఖ్యలు
కార్యనిర్వాహక ఉత్తర్వులతోచట్టాలను భర్తీ చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వాలంటే కేంద్రం తప్పనిసరిగా చట్టబద్ధమైన నోటిఫికేషన్ తీసుకురావాల్సిందేనని వ్యాఖ్యానించింది. ఇకపై ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుంటే కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఉండవని స్పష్టం చేసింది.
ప్రాజెక్టులకు పూర్తి రక్షణ
ఈ తీర్పుతో ఇప్పటికే పూర్తయిన లేదా ప్రస్తుతం జరుగుతున్న కీలక ప్రాజెక్టుల పనులకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయని, తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణాలకు పూర్తి చట్టబద్ధమైన రక్షణ లభించిందని చెప్పవచ్చు.
►ALSO READ | ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీటి తరలింపు షురూ..
