లోపభూయిష్టమైన ఎయిర్ కండిషనర్‌ను అమ్మడంతో పాటు, సమస్యను పరిష్కరించడంలో విఫలమైన ప్రముఖ సంస్థ రిలయన్స్ రిటైల్‌కు తెలంగాణ కన్స్యూమర్ కోర్ట్ గట్టి షాక్ ఇచ్చింది. బాధితుడైన వినియోగదారుడికి రూ. 80 వేలకు పైగా పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్‌కు చెందిన రాఘవేంద్ర కళిగ అనే వినియోగదారుడు ఏప్రిల్ 29, 2024న నగరంలోని ఒక రిలయన్స్ రిటైల్ అవుట్‌లెట్‌లో రూ. 60,431 పెట్టి లాయిడ్ 2.2-టన్నుల ఏసీని కొనుగోలు చేశారు. అయితే ఏసీ బిగించిన కొద్ది రోజులకే ఇండోర్ యూనిట్ నుంచి నీళ్లు లీక్ అవడం , ఆ తర్వాత పూర్తిగా పనిచేయడం ఆగిపోవడం లాంటి సమస్యలు తలెత్తాయి.
కంపెనీ నిర్లక్ష్యం
కంపెనీ టెక్నీషియన్లు పరిశీలించి మదర్‌బోర్డ్ దెబ్బతిన్నట్లు గుర్తించినప్పటికీ.. కస్టమర్ పదేపదే ఈమెయిళ్లు పంపినా, ఫాలో-అప్ చేసినా రిలయన్స్ రిటైల్ నుండి ఎలాంటి స్పందన లేదు. దీంతో విసిగిపోయిన వినియోగదారుడు మరమ్మతుల కంటే ఏసీ వాపసు కోరుతూ తెలంగాణ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు.
►ALSO READ | ఫోన్ పే, గూగుల్ పేలో ఇక మన ఫోన్ నెంబర్ కనిపించదు.. కొత్త టెక్నాలజీ దిశగా అడుగులు
ఫిర్యాదును విచారించిన కమిషన్.. రిలయన్స్ రిటైల్ వ్యవహరించిన తీరు సేవా లోపం కిందకు వస్తుందని, ఇది అన్యాయమైన వాణిజ్య పద్ధతి అని స్పష్టం చేసింది. జూలై 7వ తేదీన వెలువరించిన తీర్పులో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏసీ కొనుగోలు చేసిన మొత్తం రూ. 60,431ని, కొనుగోలు చేసిన తేదీ (ఏప్రిల్ 29, 2024) నుంచి 9 శాతం వార్షిక వడ్డీతో సహా వాపసు ఇవ్వాలి. వినియోగదారుడికి కలిగిన మానసిక ఆందోళనకు పరిహారంగా రూ. 10 వేలు , కోర్టు ఖర్చుల కోసం మరో రూ. 10 వేలు చెల్లించాలి.
ఈ ఉత్తర్వులు వెలువడిన 45 రోజులలోపు రిలయన్స్ రిటైల్ ఈ మొత్తాన్ని చెల్లించాలని, లేని పక్షంలో వడ్డీ రేటు 12 శాతానికి పెంచబడుతుందని హెచ్చరించింది. అలాగే, డబ్బులు వాపసు పొందిన తర్వాత లోపభూయిష్టమైన ఏసీని కంపెనీకి తిరిగి అప్పగించాలని వినియోగదారుడికి కమిషన్ సూచించింది.
