విద్యార్థులకు యూనిఫామ్స్ అందించాలి : నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్

విద్యార్థులకు యూనిఫామ్స్ అందించాలి :  నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ, వెలుగు :  విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన క్లాత్ అందిన ప్రాంతాల్లో వెంటనే యూనిఫామ్స్ కుట్టించి పంపిణీ చేయాలని నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​ నుంచి కేజీబీవీలు, ఎంజేపీ,  రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్స్ విషయమై విద్యాశాఖ అధికారులు, ఏపీఎంలు, సంక్షేమ శాఖల ఆర్సివోలు, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ సాధ్యమైనంత త్వరగా యూనిఫామ్స్ ఇవ్వాలన్నారు.

అనంతరం కంచనపల్లిలో ఆరుతడి పంటలు సాగు చేస్తున్న రైతులను ఆయన అభినందించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు వరికి బదులుగా కంది, పెసర, మినుము, నువ్వులు, జొన్న వంటి ఆరుతడి పంటలను సాగు చేసి తక్కువ నీటితో స్థిరమైన ఆదాయం పొందాలని సూచించారు. ఆ తర్వాత నల్గొండ మండల పరిషత్ కార్యాలయంలో వీబీజీ రాం-జీ, జలసిరి పనులపై గ్రామ సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, టెక్నికల్ సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలు, ఊట కుంటలు,  నిర్మించి ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.