గబ్బిలాలు అపశకునం కాదు.. పంటలు, మన ఆరోగ్యం కాపాడే సూపర్ హీరోలు

గబ్బిలాలు అపశకునం కాదు.. పంటలు, మన ఆరోగ్యం కాపాడే సూపర్ హీరోలు

హైదరాబాద్, వెలుగు: గబ్బిలాలను అపశకునంగా భావిస్తాం.. కానీ అవి మన ఆరోగ్యానికి, పంటలకు మేలు చేసే 'సూపర్ హీరోలు' అని ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. ఒక్కో గబ్బిలం వేలాది కీటకాలను తిని  రైతులకు కోట్ల రూపాయలు మిగులుస్తున్నాయని తేలింది. కర్నాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న గబ్బిలాలపై ఉస్మానియా వర్సిటీ వైల్డ్‌‌‌‌లైఫ్ బయాలజీ బృందం నిర్వహించిన ఈ పరిశోధన వివరాలు ఇంటర్నేషనల్​జర్నల్  ఆఫ్ త్రెటెన్డ్ టాక్సా లో ప్రచురితమయ్యాయి.  

దేశంలోనే మొట్టమొదటిసారిగా గబ్బిలాలు ఏం తింటాయో తెలుసుకోవడానికి డీఎన్ఏ మెటబార్‌‌‌‌ కోడింగ్ అనే అత్యాధునిక సాంకేతికతను పరిశోధకులు ఉపయోగించారు. కోలార్ జిల్లా హనుమనహళ్లి గుహలో  ఉంటున్న గబ్బిలాల విసర్జితాలను విశ్లేషించి వాటి ఆహారపు అలవాట్లను గుర్తించారు. ఈ గుహలో ప్రపంచంలోనే అత్యంత అరుదైన కోలార్ రౌండ్‌‌‌‌లీఫ్ బ్యాట్ నివసిస్తోంది. వీటి సంఖ్య  300 కంటే తక్కువగా ఉంది. ఈ గబ్బిలాల జాతి అంతరించిపోతే పర్యావరణానికి భారీ నష్టం తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఒక్క గబ్బిలం.. 4,100 జాతుల కీటకాలు 

ఒక్క కోలార్ రౌండ్‌‌‌‌లీఫ్ గబ్బిలం ఏకంగా 4,100 రకాల కీటకాలను తింటోంది. మిగిలిన జాతులు కూడా 1,200 నుంచి 2,400 రకాల కీటకాలను ఆహారంగా తీసుకుంటున్నాయి. డెంగ్యూ, మలేరియా వ్యాప్తికి కారణమయ్యే దోమలతోపాటు బ్యాక్టీరియాను మోసుకెళ్లే బొద్దింకలను ఇవి వేటాడి తింటున్నాయి. టొమాటో పంటను నాశనం చేసే లీఫ్ మైనర్ చిమ్మటల వంటి వ్యవసాయ తెగుళ్లను ఇవి పెద్దసంఖ్యలో ఆరగిస్తున్నాయి.  

‘గబ్బిలాలు కేవలం కీటకాలను తినడమే కాదు, అవి ప్రత్యేకంగా ప్రధాన తెగుళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయి’ అని  రీసెర్చర్​  డాక్టర్ భార్గవి శ్రీనివాసులు తెలిపారు. గబ్బిలాల గురించి అనేక అపోహాలున్నాయనీ, కానీ మన ఆరోగ్య భద్రతకు చాలా ముఖ్యమైనవని చెప్పారు. అధ్యయన కో రీసెర్చర్​ డాక్టర్ ఆదిత్య శ్రీనివాసులు మాట్లాడుతూ.. గబ్బిలాలు ఏమి తింటాయో అర్థం చేసుకోవడం వాటి పరిరక్షణకు చాలా కీలకమని, ఈ జ్ఞానం లేకుండా, మనం వాటిని లేదా అవి అందించే ముఖ్యమైన పర్యావరణ సేవలను సమర్థవంతంగా రక్షించలేమని తెలిపారు. 

వైల్డ్ లైఫ్ బయోలజీ ల్యాబ్ హెడ్ ప్రొఫెసర్ చెల్మల శ్రీనివాసులు మాట్లాడుతూ.. గబ్బిలాల సంరక్షణ కేవలం ఒక ప్రాణిని కాపాడటం మాత్రమే కాదని, అది మానవ ఆరోగ్యం, ఆహార భద్రతను రక్షించుకోవడమేనని  తెలిపారు. ఈ అద్భుత పరిశోధన చేసిన బృందాన్ని ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం అభినందించారు.