రూ. 33 వేలతో 'మన్ పిశాచ్' మూవీ నిర్మాణం.. రికార్డులు సృష్టిస్తున్న రాహి అనిల్ బార్వే మాయాజాలం!

 రూ. 33 వేలతో  'మన్ పిశాచ్' మూవీ నిర్మాణం.. రికార్డులు సృష్టిస్తున్న రాహి అనిల్ బార్వే మాయాజాలం!

సాధారణంగా ఒక సినిమా తీయాలంటే కోట్లాది రూపాయల బడ్జెట్, వందలాది మంది టెక్నీషియన్లు, భారీ తారాగణం, అత్యాధునిక కెమెరాలు ఉండాలి.  సినిమా అంటేనే 24 క్రాఫ్టుల కలయిక. కానీ, ఇప్పుడు టెక్నాలజీ మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని శాసిస్తోంది. ఈ క్రమంలోనే 'తుంబాడ్' లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాతో భారతీయ సినిమా గమనాన్ని మార్చిన దర్శకుడు రాహి అనిల్ బార్వే, ఇప్పుడు ఏఐ మాయాజాలంతో మరో సంచలనానికి తెరలేపారు. ఆయన రూపొందించిన సరికొత్త ప్రయోగాత్మక చిత్రం 'మన్ పిశాచ్' (Mann Pishach) . ఈ రోజు (మార్చి 14) ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

 సృజనాత్మక ఆయుధంగా ఏఐ!

చాలామంది ఏఐ అంటే కేవలం కొన్ని కీవర్డ్స్ ఇస్తే బొమ్మలు లేదా వీడియోలు వచ్చేస్తాయని భావిస్తారు. కానీ రాహి అనిల్ బార్వే దీనిని ఒక 'వన్ మ్యాన్ ఆర్మీ'లా మార్చారు. కేవలం తన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చుని, ఫోటోషాప్, జనరేటివ్ ఏఐ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ , ఐఫోన్ రికార్డింగ్స్ సాయంతో ఈ 80 నిమిషాల చిత్రాన్ని పూర్తి చేశారు. దీని కోసం ఆయన వెచ్చించిన బడ్జెట్ ఎంతో తెలుసా? అక్షరాలా 33 వేల రూపాయలు మాత్రమే!

►ALSO READ | Ajith Kumar : రేసింగ్ ట్రాక్ పై అజిత్ దూకుడు.. మహీంద్రా BE 6 ఫార్ములా-E కారును సొంతం చేసుకున్న థల!

రాహి అనిల్ బార్వే ఏమోషల్ పోస్టు..
లేటెస్ట్ గా  'మన్ పిశాచ్' (Mann Pishach) ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు రాహి అనిల్ బార్వే సోషల్ మీడియా వేదికగా  ఆసక్తికరమైన  పోస్ట్ చేశారు. "డబ్బులు లేవని ఏ కళాకారుడు తన కలను చంపుకోకూడదు. ఖాళీ జేబులతో కూడా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించడమే నా లక్ష్యం" అని రాహి ఈ సందర్భంగా ఉద్వేగంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ టైలర్ నెట్టింట వైరల్ గా మారింది. 

 

కథా నేపథ్యం..
ఈ 'మన్ పిశాచ్' చిత్రం  కేవలం సాంకేతిక విన్యాసం మాత్రమే కాదు, ఇది ఒక గగుర్పొడిచే సైకలాజికల్ ఫోక్-హారర్ థ్రిల్లర్. ట్రైలర్ చూస్తేనే ఈ మూవీపై ఆంచనాలు రెట్టింపు స్థాయిలో  ఉన్నాయి.  వందల కోట్లు పెట్టిన చిత్రం కూడా దీనికి ముందు పనికిరాదంటూ సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు.  ట్రైలర్ ఒళ్లు గగుర్పొడిచేలా సన్నివేశాలు ఉన్నాయి . 

 పురావస్తు శాఖకు చెందిన సదాశివ్ రావు అనే అధికారి, మహారాష్ట్రలోని మారుమూల గ్రామం 'హడమ్‌గావ్'కు వెళ్తాడు. వర్షాలకు కొండ విరిగిపడటంతో అక్కడ ఒక వింతైన రాతి గుమ్మటం (Stone Dome) బయటపడుతుంది.  ఆ గ్రామంలో అడుగుపెట్టిన సదాశివ్‌కు వింత అనుభవాలు ఎదురవుతాయి. సాయంత్రం కాకముందే ఊరంతా తలుపులు వేసుకోవడం, నిశ్శబ్దంగా మారే వీధులు అతడిని భయపెడతాయి. సావిత్రి అనే వితంతువు ఇంట్లో బస చేసిన సదాశివ్, ఆ కొండ కింద , గ్రామస్తుల మనసుల్లో దాగి ఉన్న చీకటి నిజాన్ని ఎలా కనుగొన్నాడు అనేదే అసలు కథ.

సాంకేతికతకు తోడైన మానవ మేధస్సు
ఈ చిత్రానికి జాయ్ గుల్మోహర్ స్క్రీన్‌ప్లే అందించారు. ఏఐ పరిమితులను దృష్టిలో ఉంచుకుని, డైలాగుల కంటే విజువల్స్, నిశ్శబ్దం, వాయిస్ ఓవర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రాహి ముందుగా ప్రతి షాట్‌ను కాగితంపై స్కెచ్ గీసి (Storyboards), ఆ తర్వాతే ఏఐ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించారు. ఇందులో దీపక్ దామ్లే, యానియా భరద్వాజ్ కేవలం ఇద్దరు నటులు మాత్రమే నటించడం విశేషం. నాలుగు నెలల కఠోర శ్రమ తర్వాత రూపొందిన ఈ చిత్రం, ఏఐ అనేది కేవలం ఒక సాధనం మాత్రమేనని, అసలైన జీవం పోసేది మానవ సృజనాత్మకత మాత్రమేనని చాటిచెబుతోంది.

ఈ జీరో బడ్జెట్ 'మన్ పిశాచ్'  మార్చి 18న నేరుగా యూట్యూబ్‌లో విడుదల కానుంది. సాంకేతికతను అందిపుచ్చుకుని సినిమాలు తీయాలనుకునే నేటి తరం యువ దర్శకులకు ఈ సినిమా ఒక పెద్ద పాఠం కాబోతోంది.