Ajith Kumar : రేసింగ్ ట్రాక్ పై అజిత్ దూకుడు.. మహీంద్రా BE 6 ఫార్ములా-E కారును సొంతం చేసుకున్న థల!

Ajith Kumar : రేసింగ్ ట్రాక్ పై అజిత్ దూకుడు.. మహీంద్రా BE 6 ఫార్ములా-E కారును సొంతం చేసుకున్న థల!

సౌత్ సినీ ఇండస్ట్రీలో అమితంగా ఇష్టపడే స్టార్ హీరో థల అజిత్ కుమార్. ఈ కోలీవుడ్ హీరో కేవలం వెండితెరపైనే కాదు, రియల్ లైఫ్ లోనూ రేసింగ్ ట్రాక్ లపై దూసుకుపోయే స్పీడ్ కింగ్ గా గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇటీవల దుబాయ్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కొద్దిరోజులు అక్కడే చిక్కుకుపోయిన అజిత్.. ఎట్టకేలకు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. లేటెస్ట్ గా ఆయన  మహీంద్రాకు చెందిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ను సొంతం చేసుకున్నారు. . ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.

దైవ దర్శనం 

భారత్‌కు చేరుకున్న అజిత్, ముందుగా షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు. ముంబైలోని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌ను సందర్శించిన ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. బాబా సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు ఆయనను శాలువాతో సత్కరించి, సాయిబాబా విగ్రహాన్ని బహుకరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది.

 

డ్రీమ్ కార్ సొంతం..

ఆ తర్వాత అజిత్ తన అభిరుచికి తగ్గట్టుగా ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రాకు చెందిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ Mahindra BE 6 Formula E కారును సొంతం చేసుకున్నారు. రేసింగ్ పట్ల ఆయనకున్న మక్కువను గౌరవిస్తూ మహీంద్రా ఎలక్ట్రిక్ టీమ్ ఆయనతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది. అజిత్ కు ఈ కారును మహాంద్రా గిప్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ టాంగో రెడ్ కలర్ ఎస్‌యూవీ (SUV) ఫార్ములా-E స్పూర్తితో రూపొందించబడింది. ఈ కారులో FE2 వేరియంట్ ధర సుమారు రూ.23.69 లక్షలు కాగా, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్న FE3 వేరియంట్ ధర రూ.24.49 లక్షలుగా ఉంది. ఇది గంటకు గరిష్టంగా 202 కి.మీ వేగంతో దూసుకెళ్లగలదు.

రేసింగ్ ట్రాక్ పై ‘థల’ దూకుడు.

అజిత్ కేవలం నటుడు మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న ప్రొఫెషనల్ రేసర్. 2003లో ఫార్ములా ఆసియా బీఎండబ్ల్యూ ఛాంపియన్‌షిప్, 2010లో ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న చరిత్ర ఆయనది. దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత 2025లో ‘అజిత్ కుమార్ రేసింగ్’ టీమ్‌తో మళ్లీ ట్రాక్ పైకి వచ్చారు. 24H సిరీస్‌లో పోర్షే 992 GT3 కప్ విభాగంలో సత్తా చాటారు.  ఈ ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘లే మాన్స్ కప్ 2026 ’ (Le Mans Cup 2026) లో పాల్గొనేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

గతేడాది ‘విడాముయర్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలతో మెరిసిన అజిత్, ప్రస్తుతం తన పూర్తి ఫోకస్‌ను రేసింగ్‌పైనే పెట్టారు. రేసింగ్ నుండి బ్రేక్ దొరికినప్పుడే సినిమాలు చేస్తానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, అజిత్ జీవితంలోని రేసింగ్ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు ఏఎల్ విజయ్ ఒక భారీ రేసింగ్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేసింగ్ ట్రాక్ మీద బుల్లెట్లా దూసుకెళ్లే అజిత్, మళ్లీ వెండితెరపై ఎప్పుడు సందడి చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.