పిల్లల పెంపకం ఖరీదైంది.. తప్పు చేసి తర్వాత సహాయం అడగొద్దు: వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక వ్యాఖ్యలు

పిల్లల పెంపకం ఖరీదైంది.. తప్పు చేసి తర్వాత సహాయం అడగొద్దు: వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక వ్యాఖ్యలు

విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అలరించిన వరలక్ష్మి శరత్ కుమార్.. ఇప్పుడు 'ఎస్​సరస్వతి' సినిమాతో డైరెక్టర్గా మారింది. ఆమె లీడ్​రోల్​లో నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 6న రిలీజ్ అయ్యి మిక్స్​డ్​టాక్ తెచ్చుకుంది.  ఇక ఈ మూవీ విడుదల తర్వాత బిజీగా ఉంటున్న వరలక్ష్మి.. లేటెస్ట్గా పిల్లలను కనడంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.

వరలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కుటుంబ నియంత్రణ మరియు ఆర్థిక ప్రణాళికపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘‘ఆర్థిక వ్యవస్థ మారిపోయింది. బిడ్డలను కనడం, పెంచడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. సరిగ్గా ప్లాన్ చేసుకొని ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పుడే పిల్లలను కనాలి. ఈ రోజుల్లో ప్లాన్ లేకుండా ముందుకెళ్తే ఇబ్బందులు తప్పవు.

బిడ్డలను కనడానికి నేనేమీ వ్యతిరేకం కాదు. కానీ మీకు ఎవరూ ఆర్థికంగా సాయం చేయరని గుర్తుంచుకోవాలి. చాలా మంది తమ పిల్లల విషయంలో నన్ను సహాయం అడగడానికి వస్తారు. నేను వారికి జన్మనిచ్చానా? మీరు తప్పు చేసిన తర్వాత నేను మీకు ఎందుకు సహాయం చేస్తున్నాను? మీ సొంత బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి’’ అంటూ సలహా ఇచ్చింది.

అంతేకాకుండా “సెక్స్ గురించి మాట్లాడటానికి ఇష్టపడని దేశంలో మనం జీవిస్తున్నాం. కానీ జనాభాలో మాత్రం మనం అగ్రస్థానంలో ఉన్నాం. అంటే ప్రజలు ఆ విషయాన్ని ఆచరిస్తున్నారు కానీ మాట్లాడటానికి మాత్రం సంకోచిస్తున్నారు. ఇది నాకు విచిత్రంగా అనిపిస్తుంది” అని ఆమె అన్నారు.

అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు డిఫరెంట్​గా స్పందిస్తున్నారు. ప్రతి వ్యక్తి జీవితం భిన్నంగా ఉంటుందని, పిల్లలను పెంచడం అందరికీ ఒకేలా ఉండదంటూ పోస్టులు పెడ్తుతున్నారు.

వరలక్ష్మి శరత్‌కుమార్‌ అభిప్రాయంపై మంచు లక్ష్మి

వరలక్ష్మి వ్యాఖ్యలకు నటి మంచు లక్ష్మి మద్దతు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన క్లిప్‌కు ఆమె చప్పట్లు కొడుతున్న ఎమోజీలతో స్పందించారు. ఇదిలా ఉంటే, వరలక్ష్మి వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె అభిప్రాయాలను సమర్థిస్తూ “ఆమె నిజం మాట్లాడుతోంది” అని కామెంట్లు చేయగా, మరికొందరు ప్రతి కుటుంబ పరిస్థితి భిన్నంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఒక నెటిజన్ స్పందిస్తూ, “నేను నటుడు లేదా నటి మాటలను చాలా సీరియస్‌గా తీసుకోను. కొన్ని సంవత్సరాల తర్వాత అదే వ్యక్తి పిల్లల కోసం దేవుడిని ప్రార్థిస్తూ, IVF చికిత్సలకు లక్షలు ఖర్చు చేస్తూ కనిపిస్తారు. అప్పటికి వారు త్వరగా పిల్లలను కనాలని మరో ప్రసంగం కూడా ఇవ్వొచ్చు” అని వ్యాఖ్యానించారు.

మరో వ్యక్తి, ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదని అభిప్రాయపడ్డారు. “అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు మేడమ్. గెలిచినవారి మాటలు సూక్తుల్లా అనిపిస్తాయి. ఓడిపోయినవారి మాటలు మాత్రం సాకుల్లా కనిపిస్తాయి” అని కామెంట్ చేశారు.