కోమాలో ఇరాన్ సుప్రీం మొజ్తబా!..బాంబు దాడిలో తెగిపోయిన కాలు!

కోమాలో ఇరాన్ సుప్రీం మొజ్తబా!..బాంబు దాడిలో తెగిపోయిన కాలు!
  • బాంబు దాడిలో తెగిపోయిన కాలు, పొట్ట, కాలేయం భాగాల్లో బలమైన గాయాలు
  • సినా వర్సిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ చికిత్స
  • అంతర్జాతీయ మీడియాలో కథనాలు.. స్పందించని ఇరాన్‌‌‌‌‌‌‌‌

టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్న వేళ.. ఇరాన్ నుంచి సంచలన వార్తలు వెలువడుతున్నాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారని, బాంబు దాడిలో ఓ కాలును కోల్పోయారని పేర్కొన్నాయి. 

ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడిలో తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ మరణించగా, అదే దాడిలో మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడినట్టు ‘ది సన్’ పత్రిక వెల్లడించింది. 56 ఏండ్ల మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం టెహ్రాన్‌‌‌‌‌‌‌‌లోని ‘సినా వర్సిటీ హాస్పిటల్’లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ఈ దాడిలో ఆయన ఒక కాలును కోల్పోయారని, పొట్ట, కాలేయ భాగాల్లో బలమైన గాయాలయ్యాయని తెలిపింది. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని, పరిస్థితి అత్యంత విషమంగా ఉందని టెహ్రాన్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆసుపత్రి చుట్టూ భారీ భద్రత

మొజ్తబాకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రిని ఇరాన్ భద్రతా బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆరోగ్య శాఖ మంత్రి, ప్రముఖ ట్రామా సర్జన్ మహ్మద్ రెజా జాఫర్‌‌‌‌‌‌‌‌ ఘండి నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నదని సమాచారం. అయితే, ఇరాన్ ప్రభుత్వం ఈ వార్తలను ధ్రువీకరించలేదు. 

కాగా, మొజ్తబా కోమాలో ఉన్నప్పటికీ ఇరాన్ ప్రభుత్వ యంత్రాంగం, యుద్ధ వ్యూహం మాత్రం ఆగడంలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అలీ ఖమేనీ ఏర్పాటుచేసిన వ్యవస్థ ఇప్పుడు ఒక అదృశ్య శక్తిలాగా పనిచేస్తున్నదని, నాయకుడు లేకపోయినా క్షిపణులు, డ్రోన్‌‌‌‌‌‌‌‌ దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఒక ఇరాన్ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.