మధ్యప్రాచ్యం (Middle East) లో జరుగుతున్న దాడులు ఇప్పుడు నేరుగా మన వంటింటిపై ప్రభావం చూపుతోంది. అరేబియా సముద్ర మార్గంలో గ్యాస్ రవాణాకు ఆటంకాలు కలగడంతో, దేశంలో ఎల్‌పీజీ (LPG) సరఫరా నెమ్మదించింది. ప్రభుత్వం పరిస్థితులు అన్ని కంట్రోల్లోనే ఉన్నాయి అని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు వేరేలా ఉన్నాయి.
ఈ మార్చి నెలలోనే గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. ఇంటి అవసరాలకు వాడే సిలిండర్‌పై రూ. 60, హోటళ్లలో వాడే కమర్షియల్ సిలిండర్‌పై రూ. 144 పెరగడంతో అదనపు భారం పడింది.
సిలిండర్ బుకింగ్‌లో మార్పులు
గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వం బుకింగ్ నియమాలను కఠినతరం చేసింది. దీనివల్ల ఒక సిలిండర్ అయిపోతే రెండోది రావడానికి ఎక్కువ రోజులు వేచి చూడాల్సి వస్తుంది. పల్లెటూర్లలో అయితే ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండోది బుక్ చేయడానికి 45 రోజుల గ్యాప్ ఉండాలి. ఇక పట్టణాల్లో ఈ గడువును 21 రోజుల నుండి 25 రోజులకు పెంచారు.
14.2 కిలోల వంటింటి గ్యాస్ ధర న్యూఢిల్లీలో రూ.913.00, కోల్‌కతాలో రూ.939.00, ముంబైలో రూ.912.50, చెన్నైలో రూ.928.50, బెంగళూరులో రూ.915.50, హైదరాబాద్లో రూ.965.00, లక్నోలో రూ.950.50, పాట్నాలో రూ.1,002.50, తిరువనంతపురంలో రూ.922.00,
19 కిలోల కమర్షియల్ గ్యాస్ ధర న్యూఢిల్లీలో రూ.1,884.50, కోల్‌కతాలో రూ.1,988.50, ముంబైలో రూ.1,836.00, చెన్నైలో రూ.2,043.50, బెంగళూరులో రూ.1,958.00, హైదరాబాద్ రూ.2,105.50, లక్నోలో రూ.2,007.00, పాట్నాలో రూ.2,133.50, తిరువనంతపురంలో రూ.1,912.00
ప్రస్తుతం అందరిలో ఉన్న పెద్ద ప్రశ్న ఏంటంటే నిజంగా గ్యాస్ కొరత ఉందా..? అని.... పెట్రోలియం మంత్రిత్వ శాఖ మాత్రం తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నాయి అని చెబుతున్నప్పటికీ, గ్రౌండ్ రిపోర్ట్‌లు వేరే సూచిస్తున్నాయి. వాణిజ్య గ్యాస్ సరఫరా జాప్యాల కారణంగా కొచ్చి, ముంబై, బెంగళూరు వంటి మహానగరాలలో హోటళ్ళు, టిఫిన్ సెంటర్లు మెనూ ఐటెమ్‌లను తగ్గించాగా... మరికొన్ని ముందుగానే మూసేసాయి.
భారతదేశం దిగుమతులపై ఆధారపడటం వల్ల మన దేశానికి కావాల్సిన గ్యాస్‌లో 60% విదేశాల నుంచే వస్తుంది. ఇరాన్ ఇజ్రాయిల్ దాడుల వల్ల సముద్ర మార్గాల్లో రవాణా కష్టమవుతోంది. దీనికి తోడు రవాణా ఖర్చులు కూడా 1000% పెరగడంతో గ్యాస్ తెప్పించడం భారంగా మారింది. గ్యాస్ దొరకదేమో అన్న భయంతో అందరూ ఒకేసారి బుక్ చేయడం వల్ల వెయిటింగ్ పీరియడ్ పెరుగుతోంది.
