కొనసాగుతున్న రూపాయి పతనం

కొనసాగుతున్న రూపాయి పతనం

న్యూఢిల్లీ: యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మరింత పెంచనుండడంతో పాటు, దేశ వాణిజ్య లోటు పెరుగుతుండడంతో రూపాయి పతనం  కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 26 నుంచి 27 మధ్య ఫెడ్ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్‌‌లో వడ్డీ రేట్లను 50 నుంచి 75 బేసిస్ పాయింట్లు పెంచుతారనే అంచనాలు ఉన్నాయి.

ఇలా ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతుండడంతో ఇండియా వంటి  అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి  ఇన్వెస్ట్‌‌మెంట్లు యూఎస్‌‌ బాట పడుతున్నాయి. దేశం నుంచి డాలర్లు వెళ్లిపోతుండడంతో పాటు క్రూడాయిల్ రేట్లు గరిష్ట స్థాయిల్లో ఉండడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 82 వరకు తగ్గొచ్చని ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. కిందటి వారం డాలర్ మారకంలో రూపాయి 80.06  వద్ద ఆల్‌‌టైమ్ కనిష్టాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. 

రూపాయి విలువ రికార్డ్ లెవెల్‌‌కు పడిన తర్వాత తిరిగి కోలుకుంటుందని, వచ్చే ఏడాది మార్చి నాటికి 78 లెవెల్‌‌ వద్ద  సెటిలవుతుందని ఎకనామిస్టులు అభిప్రాయపడుతున్నారు. క్రూడాయిల్‌‌ రేట్లు తగ్గుతాయని, జియోపొలిటికల్ టెన్షన్లు సద్దుమణుగుతాయని వీరు భావిస్తున్నారు. ‘ డాలర్ మారకంలో రూపాయి విలువ  79 దగ్గర్లో ఉంటుంది. ఈ ఏడాది రూపాయి సగటు ధర ఇది. ప్రస్తుత జియో పొలిటికల్ టెన్షన్లను బట్టి రూపాయి విలువ డాలర్ మారకంలో 81 వరకు పడొచ్చు’ అని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఎకనామిస్ట్‌‌  సునీల్ కుమార్ సిన్హా అన్నారు. 

క్రూడాయిల్ ధరలు పడినా, తిరిగి లేస్తుండడంతో సమీప కాలంలో డాలర్‌‌‌‌ బలంగా ఉంటుందని అంచనా వేశారు ‘గ్లోబల్‌‌ అంశాలు, విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్ల(ఎఫ్‌‌పీఐ) కదలికలు రూపాయి ఇంకా పడుతుందా? లేదా? అనేది నిర్ణయిస్తాయి. లేదా యూఎస్‌‌లో ఆర్థిక మాంద్యం వస్తే డాలర్ బలహీనపడితే రూపాయి పెరగొచ్చు’ అని  ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్‌‌ అదితి నాయర్ పేర్కొన్నారు.

రేటింగ్‌‌ కంపెనీ నోమురా అంచనాల ప్రకారం, డాలర్ మారకంలో రూపాయి విలువ ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో  82 లెవెల్‌‌కు పడుతుంది.  సమీప కాలంలో రూపాయిపై ఒత్తిడి కొనసాగుతుందని,  డాలర్‌‌‌‌–రూపాయి మారకంలో  ఎక్కువ వోలటాలిటీ ఉండడంతో పాటు రూపాయి విలువ తగ్గడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని క్రిసిల్ అంచనా వేస్తోంది.