PUBGని బ్యాన్ చేయాలి : బాధిత తల్లిదండ్రులు

PUBGని బ్యాన్ చేయాలి : బాధిత తల్లిదండ్రులు

పబ్ జీ గేమ్ ఆడొద్దన్నందుకు తమ కొడుకు ప్రాణాలు తీసుకోవడం ఆ కుటంబంలో తీరని విషాదం నింపింది. మల్కాజిగిరిలోని విష్ణుపురి కాలనీలో ఉండే టెన్త్ క్లాస్ స్టూడెంట్ సాంబ శివ(16) మంగళవారం నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎగ్జామ్స్​ ఉన్నాయి కదా ఇప్పుడు కూడా గేమ్స్​ ఆడితే ఎలా అని తల్లి మందలించడంతో… రాత్రి టైమ్ లో తన రూమ్ లోనే ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.

పబ్ జీ గేమ్ కు పసిపిల్లలు దారుణంగా బానిసవుతున్నారని.. సాంబశివ తండ్రి భరత్ అన్నారు. ప్రస్తుతం యువత, పిల్లలు దీనికి బానిస అవుతున్నారనీ.. ప్రాణాలు తీస్తున్న పబ్ జి గేమ్ లను బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. “తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చే ఇలాంటి గేమ్స్ ను నిషేధించాలి. రెండు నెలలు నుంచి ఈ గేమ్ కు బాగా అలవాటు అయ్యాడు. గేమ్ ఆడొద్దు అని ఎన్ని సార్లు చెప్పినా వినలేదు. చాలా సార్లు మందలించాం. అయిన కానీ వినలేదు. ఫోన్ లో గేమ్ డిలీట్ చేసినా కూడా… మళ్లీ ఇన్ స్టాల్ చేసుకునేవాడు. పరీక్ష లు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం గట్టిగా మందలించాం. కానీ ఇంత దారుణం చేసుకుంటాడని అనుకోలేదు” అని బోరుమన్నారు బాధిత తండ్రి.

లాస్ట్ ఎగ్జామ్ కు ముందు ఈ సంఘటన జరిగిందని… పబ్ జీ గేమ్ కు అడిక్ట్ అయి ఉండకపోతే.. తన తమ్ముడు తనకు దక్కేవాడని అతడి అక్క చెప్పారు. పేరెంట్స్ పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చినా అందులో గేమ్స్ ఉండకుండా చూడండి” అని ఆమె కోరారు.