అటవీ అధికారులు..గిరిజనుల మధ్య మళ్లీ వార్

అటవీ అధికారులు..గిరిజనుల మధ్య మళ్లీ వార్
  • కేబినెట్‌‌ సబ్‌‌ కమిటీ, అప్లికేషన్ల పేరుతో హడావుడి
  • హక్కు పత్రాల కోసం 2.20 లక్షలకుపైగా దరఖాస్తులు
  • నాలుగు నెలలైనా వాటిని పట్టించుకోని రాష్ట్ర సర్కారు
  • ఇదిట్లుండగానే ట్రెంచ్‌‌లు వేసేందుకు అధికారుల యత్నం
  • గిరిజనులు, ఫారెస్ట్ అధికారుల మధ్య మళ్లా లొల్లులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గిరిజనుల పోడు భూముల సమస్య ఇప్పట్లో తీరే పరిస్థితి కనిపించడం లేదు. ఏడేండ్లుగా అగో చేస్తం.. ఇగో చేస్తమని నాన్చుతూ రాష్ట్ర సర్కారు కాలం వెళ్లదీస్తోంది. గతేడాది కేబినెట్‌‌‌‌ సబ్‌‌‌‌ కమిటీ వేసి, భూహక్కుల పత్రాలకు దరఖాస్తుల స్వీకరణ ముచ్చట చెప్పి పక్కనపడేసింది. అప్లికేషన్లు తీసుకుని నాలుగు నెలలైనా దాని ఊసే ఎత్తడంలేదు. పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించకుండా, ఉన్న భూములనే లాక్కుంటూ అన్యాయం చేస్తోంది. దీంతో మళ్లీ గిరిజనులు, ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్ల మధ్య లొల్లులు షురూ అయ్యాయి.
7 లక్షల ఎకరాల్లో పోడు సమస్య
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రం భీం-ఆసిఫాబాద్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూల్ సహా పలు జిల్లాల్లోని సుమారు7 లక్షల ఎకరాల్లో పోడు భూముల సమస్య ఉంది. గోండులు, కొలాంలు, నాయక్ పోడ్​లు, బంజారాలు, కోయలు లాంటి గిరిజన తెగలతోపాటు కొందరు గిరిజనేతరులు ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుని జీవిస్తున్నారు. పోడు భూములపై ఆదివాసీలకు సాగు హక్కులు కల్పించాలని ఆర్వోఎఫ్ఆర్ యాక్ట్ తెచ్చినా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌‌‌‌ రాజశేఖర్‌‌‌‌ రెడ్డి హయాంలో కొంత మందికి హక్కు పత్రాలు ఇచ్చినా ఆ తర్వాత పట్టించుకున్న నాథుడే లేడు.
కేబినెట్‌‌‌‌ సబ్‌‌‌‌ కమిటీ.. దరఖాస్తులు ఉత్తవేనా?
పోడు భూముల సమస్య పరిష్కారం కోసం గతేడాది కేబినెట్ సబ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలు దఫాలు సమావేశమై వివిధ అంశాలపై చర్చించి విధివిధానాలు రూపొందించింది. ఆ తర్వాత జిల్లాల్లో కమిటీలు వేశారు. ఈ కమిటీలు నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు గిరిజనులు, గిరిజనేతరుల నుంచి పట్టాల కోసం అప్లికేషన్లు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల ఎకరాల కోసం 2.20 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఈ దరఖాస్తులను ఇప్పటి దాకా కనీసం పరిశీలించలేదు. సమస్యను తీర్చాలనే కనీస ధ్యాస పెట్టడం లేదని, దీంతో దరఖాస్తులన్నీ బుట్టదాఖలయ్యాయనే విమర్శలు వస్తున్నాయి.
ఏడేండ్లుగా ముచ్చట చెప్పుడే
పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్‌‌‌‌ ఏడేండ్ల నుంచి చెబుతూ వస్తున్నారు. 2014, 2018 ఎన్నికల సమయంలోనూ పోడు భూములకు పట్టాలిస్తామని​హామీ ఇచ్చారు. తానే స్వయంగా వచ్చి కుర్చీ వేసుకొని సమస్యను పరిష్కరిస్తానని పలు సందర్భాల్లో కేసీఆర్‌‌‌‌ ప్రకటించారు. ‘‘పోడు భూముల సమస్య పరిష్కరిస్త. నేనే వస్త. ఒక్కడ్నే కాదు. నా ఎంబడి సీఎస్, రెవెన్యూ మంత్రి, రెవెన్యూ సెక్రటరీ, హోం మంత్రి, మంత్రులు, ఇతర సెక్రటరీలు వస్తరు. అందరం పోయి గిరిజన ప్రాంతాల్లో ప్రజా దర్బార్‌‌‌‌ పెడుతాం. వాట్ ఇజ్ వాట్.. వాట్ ఇజ్ నాట్.. అనేది తేల్చేద్దాం’’అని 2020 మార్చి 16న అసెంబ్లీలో చెప్పారు. కానీ ఇప్పటి దాకా అడుగు ముందుకు పడలేదు.
అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి
పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్‌‌‌‌.. ఇప్పుడు దానిని గాలికొదిలేశారు. రాష్ట్రంలో గిరిజన చట్టాలు అమలవుతున్నాయా? అనే అనుమానం కలుగుతోంది. ఏడేండ్లుగా సమస్యను పరిష్కరించకపోవడమేంటి? చట్టం పేరుతో పోడు రైతులను వేధిస్తే సహించేది లేదు. ప్రభుత్వం చిత్తశుద్ధితో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి. లేకుంటే మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమిస్తం. - ధర్మానాయక్‌‌‌‌, తెలంగాణ గిరిజన సంఘం, ప్రెసిడెంట్‌‌‌‌
మళ్లీ లొల్లులు
రాష్ట్రంలో ఫారెస్ట్ ఆఫీసర్లు, గిరిజనుల నడుమ మళ్లీ వార్​ నడుస్తోంది. గిరిజనులపై కేసులు కూడా పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కరిస్తామని చెబుతుండగా, ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు మాత్రం గిరిజనుల భూముల్లో ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు ట్రెంచ్‌‌‌‌లు వేస్తున్నారు. గిరిజనులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంటోంది. పలు జిల్లాల్లో ఈ తరహా ఘటనలు జరిగాయి.