పంజాబ్‌లో ఘోరం: మెడికల్ షాపులో వాగ్వాదం.. ఫేస్‌బుక్ లైవ్‌లోనే యాంటీ-డ్రగ్ యాక్టివిస్ట్ కాల్చివేత!

పంజాబ్‌లో ఘోరం: మెడికల్ షాపులో వాగ్వాదం.. ఫేస్‌బుక్  లైవ్‌లోనే యాంటీ-డ్రగ్ యాక్టివిస్ట్ కాల్చివేత!

 పంజాబ్‌లోని మాన్సా పట్టణంలో మంగళవారం(13 అక్టోబర్) ఉదయం దారుణం జరిగింది. మాదకద్రవ్యాల (డ్రగ్స్) వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడే పర్వీందర్ సింగ్ ఝోటా అనే యాంటీ-డ్రగ్ యాక్టివిస్ట్‌ను  మందుల దుకాణంలో (కెమిస్ట్ షాప్) వ్యక్తి లైవ్ లోనే  కాల్చి చంపారు. ఈ ఘటనలో పర్వీందర్‌తో పాటు ఉన్న నలుగురు సహచరులకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి.

ఫేస్‌బుక్ లైవ్‌లో రికార్డైన హత్య
ఈ గొడవంతా పర్వీందర్ సింగ్ తన ఫేస్‌బుక్ పేజీలో లైవ్‌స్ట్రీమ్ చేశారు. షాపు యజమానికి, పర్వీందర్ తో పాటు అతని సహచరులకు మధ్య మందుల విషయంలో వాగ్వాదం జరగడం, ఆ తర్వాత పెద్ద ఘర్షణగా మారి కాల్పులకు దారితీయడం వంటి సుమారు 6 నిమిషాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కాల్పుల్లో గాయపడిన ఐదుగురిని వెంటనే మాన్సా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే పర్వీందర్ సింగ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఆయన శరీరంలో మూడు బుల్లెట్లు దిగాయని, అందులో రెండు కడుపులోకి, ఒకటి తొడలోకి వెళ్లాయని ఆసుపత్రి సీనియర్  డాక్టర్ గుర్మైల్ సింగ్ తెలిపారు.

ముఖ్యంగా ఒక బుల్లెట్ ఆయన కాలేయానికి  (Liver) తగలడంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. మిగతా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

రాజకీయ దుమారం & తీవ్ర ఆరోపణలు
ఈ హత్య వార్త తెలియగానే ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు చేరడంతో  తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై శిరోమణి అకాలీ దళ్ (SAD) నాయకుడు విక్రమ్ సింగ్ మజీతియా తీవ్రంగా స్పందించారు. కెమెరా ముందే డ్రగ్స్ వ్యాపారులను బట్టబయలు చేస్తున్నందుకే పర్వీందర్‌ను పథకం ప్రకారమే హత్య చేశారని ఆయన ఆరోపించారు.

►ALSO READ | బైక్పై వెళుతుండగా ఢీ కొట్టిన మరో బైక్.. పాపం.. అన్నాచెల్లి ఇద్దరి ప్రాణాలు దక్కలే !

ఆ మందుల దుకాణ యజమానికి హెరాయిన్ లాంటి మడకద్రవ్యాలు అమ్మే వారితో సంబంధం ఉందని పేర్కొన్నారు. పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న వారి గొంతును అణచివేస్తున్నారని మజీతియా మండిపడ్డారు.

అయితే, షాపు యజమానికి డ్రగ్స్ అమ్మకాలతో సంబంధం ఉందా లేదా అనే  ఆరోపణలు ఇంకా అధికారికంగా  నిర్ధారించబడలేదు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.