దేవాదాయ శాఖ భూములను.. ఫార్మాసిటీకి తీస్కునుడేంది

దేవాదాయ శాఖ భూములను.. ఫార్మాసిటీకి తీస్కునుడేంది
  • హైకోర్టు పర్మిషన్  తీసుకోవాలి కదా
  • ప్రభుత్వాన్ని నిలదీసిన డివిజన్ బెంచ్
  • భూముల సేకరణపై స్టేటస్‌‌ కో విధిస్తూ 
  • మధ్యంతర ఉత్తర్వులు జారీ

హైదరాబాద్,వెలుగు:  రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నంది వనపర్తి, సింగారం గ్రామాల్లోని దేవాదాయ శాఖకు చెందిన 1022.32 ఎకరాలను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఫార్మా సిటీ ఏర్పాటు కోసం ఎట్ల తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దేవాదాయ శాఖ భూమిని నీటిపారుదల అవసరాలకు మాత్రమే తీసుకోవచ్చన్నపుడు ఫార్మా సిటీకి తీసుకోవడం సరికాదని తేల్చి చెప్పింది. కోర్టు ముందస్తు అనుమతి అవసరమని స్పష్టం చేసింది. ఇదే వ్యవహారంలో ఉమ్మడి ఏపీ హైకోర్టు డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ షరతులతో కూడిన ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయాన్ని హైకోర్టు తాజాగా గుర్తు చేసింది. భూసేకరణపై స్టేటస్‌‌‌‌‌‌‌‌ కో కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

యాచారం మండలంలోని ఓంకారేశ్వర స్వామి ఆలయ భూములను ఫార్మా సిటీ కోసం భూ సేకరణకు అనుమతిస్తూ  గతంలో సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఇద్దరు రైతులు సవాల్ చేస్తూ అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌ టి.వినోద్‌‌‌‌‌‌‌‌ కుమార్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ కార్తీక్‌‌‌‌‌‌‌‌తో కూడిన డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ మంగళవారం విచారణ జరిపింది. ఆలయ భూముల్ని ప్రభుత్వం తీసుకోవాలన్నా.. వేరోళ్లకు కేటాయించాలన్నా.. అమ్మాలన్నా.. హైకోర్టు అనుమతి తీసుకోవాలని ఉమ్మడి ఏపీ హైకోర్టు డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ షరతులతో ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో టీఎస్‌‌‌‌‌‌‌‌ఐఐసీ హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసిన కేసులో ఫార్మా సిటీకి భూసేకరణకు అనుమతిస్తూ సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సవాల్‌‌‌‌‌‌‌‌ చేస్తూ జంగయ్య, దేవేజీ అనే ఇద్దరు రైతులు అప్పీల్​ పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. హైకోర్టు సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు అడ్వకేట్ కోర్టుకు విన్నవించారు. నిజానికి భూ సేకరణ చేయాల్సింది రెవెన్యూ శాఖ అని, టీఎస్‌‌‌‌‌‌‌‌ఐఐసీ హైకోర్టు నుంచి అనుమతి పొందడం చెల్లదని  వాదించారు.

పిటిషన్​ కొట్టేయాలన్న గవర్నమెంట్ స్పెషల్ ప్లీడర్

గవర్నమెంట్ స్పెషల్‌‌‌‌‌‌‌‌ ప్లీడర్‌‌‌‌‌‌‌‌ ఎ.సంజీవ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ స్పందిస్తూ.. గతంలో సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి, డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌లు ఉత్తర్వులు జారీ  చేశాయన్నారు. అప్పీల్ పిటిషనర్లు ప్రతివాదులు కాదని, పిటిషన్‌‌‌‌‌‌‌‌ను కొట్టేయాలని కోరారు. దేవాదాయ శాఖ, ఆలయ కమిటీలు అనుమతించాయని, ఇందులో ఇతరులకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. వాదనల తర్వాత హైకోర్టు స్పందిస్తూ.. దేవాదాయ శాఖ భూమిని నీటిపారుదల అవసరాలకు మాత్రమే తీసుకోవచ్చన్నపుడు ఫార్మా సిటీకి ఎలా తీసుకున్నారని ప్రశ్నించింది. దేవాదాయశాఖ భూములను తీసుకోవాలనుకుంటే కోర్టు ముందస్తు అనుమతి అవసరమని డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేసినపుడు సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి ఎలా విచారించి ఉత్తర్వులు ఇస్తారని ప్రశ్నించింది. కొన్ని పిటిషన్లను సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జికి, మరికొన్ని పిటిషన్లను డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ వద్దకు ఎలా పంపుతారనే సందేహాన్ని వ్యక్తం చేసింది. గత హైకోర్టు ఉత్తర్వులను పరిశీలించి తుది ఉత్తర్వులు జారీ చేస్తామని, అప్పటి వరకు భూసేకరణపై స్టేటస్‌‌‌‌‌‌‌‌కో  ఆర్డర్‌‌‌‌‌‌‌‌ అమల్లో  ఉంటుందని ప్రకటించింది.