తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణకు మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. రాష్ట్రంలో మే 22 తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని హెచ్చరించింది ఐఎండీ. ఈ నాలుగైదు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతోనే రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది ఐఎండీ. ప్రస్తుతం కొనసాగుతున్న ఆవర్తనానికి తోడు చత్తీస్ గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్ కర్నాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కూడా దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది ఐఎండీ

పలు జిల్లాలకు వచ్చే మూడు రోజులకుగానూ ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అలాగే ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. హైదరాబాద్ సిటీలోనూ వచ్చే మూడు రోజుల పాటు ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. మరో వారం పాటు రాష్ట్రంలో వర్షాలే ఉంటాయని తెలిపింది. 

రాష్ట్రంలోని సిటీ సహా పలు జిల్లాల్లో మే 18న  మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్ సిటీతో పాటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా హైదరాబాద్ లోని లింగంపల్లిలో 6.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.