మెదక్ టౌన్, వెలుగు: కోర్టు కేసుల్లో రాజీయే రాజమార్గమని మెదక్ జిల్లా జడ్జి నీలిమ అన్నారు. ఆదివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కోర్టు ప్రాంగణంతో పాటు నర్సాపూర్, అల్లాదుర్గం కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మొత్తం 5 బెంచ్‌ల ద్వారా లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించారు.
జడ్జి నీలిమ మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 3,398 కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని జడ్జిలు శుభవల్లి, రుబీనా ఫాతిమా, సిరి సౌజన్య, సిద్దయ్య, స్వాతి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాములు, అన్ని కోర్టుల సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.
సిద్దిపేట రూరల్: కేసుల సత్వర పరిష్కారం కోసమే లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు జడ్జి రమాదేవి తెలిపారు. జడ్జి మాట్లాడుతూ లోక్ అదాలత్ లో 2420 క్రిమినల్ కేసులతోపాటు, 45 సివిల్ కేసులు పరిష్కరించి, 16 మోటర్ ప్రమాద కేసుల్లో రూ. 1, 34, 75 000 ఇప్పించడంతోపాటు, 67 బ్యాంకు కేసుల్లో రూ.26, 97,267 లక్షల సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు.
జిల్లావ్యాప్తంగా 14583 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిలో 1557 కేసులను గుర్తించి 828 కేసులకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు పీవీ నరసింహారావు చారిటబుల్ ట్రస్ట్ వారు కోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలకు సర్టిఫికెట్లను అందజేశారు.
సంగారెడ్డి టౌన్ : జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 4248 కేసులను పరిష్కరించినట్లు జడ్జి జయంతి చెప్పారు. ఆమె మాట్లాడుతూ క్రిమినల్ కేసులు 3,635, సివిల్ కేసులు 39, మోటార్ వాహన ప్రమాద పరిహారం కేసులు 9, పరిహారం కేసులు 534, సైబర్ క్రైమ్ కేసులు 21 పరిష్కరించారు. కార్యక్రమంలో జడ్జిలు తేజో కార్తీక్, సౌజన్య, అనిత, ధనలక్ష్మి, దుర్గారాణి , కోర్టు సిబ్బంది, అడ్వకేట్లు, పోలీసులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
