ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో అతి తక్కువ ఆదాయం చూపించి, మరోవైపు భారీ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్ చేసే వారికి ఈ కేసు ఒక హెచ్చరిక లాంటిది. కేవలం రూ.4లక్షల 81వేల వార్షిక ఆదాయాన్ని వెల్లడించిన ఒక మహిళ.. రూ. 50 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి ఆదాయపు పన్ను శాఖకు చిక్కిపోయింది. ఈ వ్యవహారం చివరకు ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యూనల్ వరకు వెళ్లగా.. అక్కడ ఆమెకు చుక్కెదురైంది. ఆదాయానికి, పెట్టుబడికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసమే ఆమెను చిక్కుల్లో పడేసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. ప్రతిభ అనే టాక్స్ పేయర్ తన ఐటీ రిటర్న్స్‌లో ఏడాదికి గానూ రూ.4లక్షల 81వేలు ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. అయితే ఐటీ శాఖ స్క్రూటినీలో ఆమె పేరు మీద రూ.50 లక్షల భారీ ప్రీమియం చెల్లింపు జరిగినట్లు తేలింది. ఇంత తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి.. తన ఆదాయానికి పదింతలు ఎక్కువగా ఉన్న ప్రీమియంను ఎలా కట్టగలికింది అన్నది అధికారుల ప్రధాన సందేహం. సాధారణంగా ఐటీ చట్టాల ప్రకారం.. ఆదాయానికి మించి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినప్పుడు, ఆ డబ్బు ఎక్కడిది అనే సోర్స్ చూపకపోతే ఆ మొత్తాన్ని 'గుర్తించబడని పెట్టుబడి'గా పరిగణించి పన్ను విధిస్తారు.
దీనికి ప్రతిభ స్పందిస్తూ.. ఆ రూ.50 లక్షలు తన వ్యక్తిగత సంపాదన కాదని, అది తమ కుటుంబానికి చెందిన HUF సొమ్ము అని వాదించింది. తమ హెచ్‌యూఎఫ్ కి ఉన్న యాపిల్ తోటల ద్వారా వచ్చిన వ్యవసాయ ఆదాయాన్ని ఆ ఇన్సూరెన్స్ కోసం వాడామని ఆమె వివరణ ఇచ్చింది. అయితే ఇక్కడే సరైన డాక్యుమెంట్లు లేనట్టు బయటపడింది. ఇన్వెస్ట్‌మెంట్ మరొకరిది అని చెప్పినప్పుడు.. దానికి సంబంధించిన లిఖితపూర్వక ఒప్పంద పత్రాలు, అకౌంట్ బుక్స్ లేదా క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.
ట్రిబ్యూనల్ ఈ ఆధారాలను పరిశీలించగా.. ప్రతిభ దగ్గర తగిన డాక్యుమెంట్స్ లేవని గుర్తించింది. హెచ్‌యూఎఫ్ వద్ద రూ.50 లక్షల నగదు నిల్వలు ఉన్నట్లు చూపే బ్యాంక్ స్టేట్‌మెంట్లు గానీ, సరైన అకౌంటింగ్ ఎంట్రీలు గానీ లేకపోవడంతో ట్రిబ్యూనల్ ఆమె వాదనను తోసిపుచ్చింది. ఫలితంగా ఆ రూ.50 లక్షల మొత్తాన్ని ఆమె వ్యక్తిగత ఆదాయంగానే పరిగణించాలని అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. దీనివల్ల ఆమె భారీగా పన్ను చెల్లించడమే కాకుండా, పెనాల్టీలు, వడ్డీ భారాన్ని కూడా మోయాల్సి వచ్చింది.
ఈ కేసు పన్ను చెల్లింపుదారులకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతోంది. మీ ఆదాయం తక్కువగా ఉండి, భారీ ఆర్థిక లావాదేవీలు చేస్తున్నప్పుడు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే సోర్స్ నిరూపించే సేల్ డీడ్లు, గిఫ్ట్ డీడ్లు లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. కేవలం నోటి మాటతో ఇచ్చే వివరణలను ఐటీ శాఖ అంగీకరించదు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నిధులు వాడినప్పుడు, ప్రతి పైసాకు పక్కాగా డాక్యుమెంటేషన్ ఉండటం తప్పనిసరి అని గుర్తుంచుకోండి టాక్స్ పేయర్స్.
