ప్రధాని నరేంద్ర మోడీ రేపు ( మే 10వ )తేదీన తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ..ఆయనకు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నాలుగు ప్రధాన డిమాండ్లపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ లేఖలో డిమాండ్ చేశారు.
నాలుగు డిమాండ్లు ఇవే:
పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా
ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పాలిట జీవనాడి అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వెంటనే 'జాతీయ హోదా' కల్పించాలి. 12 లక్షల 31 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును 90 శాతం కేంద్ర నిధులతో పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
2027 జనగణనలో బీసీ గణన
దేశంలో బీసీల జనాభాపై కచ్చితమైన లెక్కలు లేకపోవడం వల్ల అభివృద్ధి పథకాలు అందరికీ చేరడం లేదు. అందుకే రాబోయే 2027 జనాభా లెక్కల్లో బీసీల కోసం ప్రత్యేక కాలమ్‌ను చేర్చి, కులాల వారీగా స్పష్టమైన గణన చేపట్టాలని లేఖలో కోరారు.
►ALSO READ | మోదీ సభకు ముందు నాపై కుట్ర.. కొడుకు మీద ఆరోపణలపై బండి సంజయ్ రియాక్షన్
మహిళా రిజర్వేషన్లలో బీసీ సబ్ కోటా
చట్టసభల్లో మహిళలకు కేటాయించే 33 శాతం రిజర్వేషన్లలో.. బీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా ఉండాల్సిందేనని కవిత స్పష్టం చేశారు. అప్పుడే వెనుకబడిన వర్గాల మహిళలకు రాజకీయంగా సమాన అవకాశాలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ బీసీ బిల్లులకు ఆమోదం
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించేలా కేంద్రం చొరవ చూపాలని కోరారు. ఈ నాలుగు అంశాలు తెలంగాణ భవిష్యత్తుకు ఎంతో కీలకమని.. రాష్ట్ర బీజేపీ ఎంపీలు సైతం రాజకీయాలకు అతీతంగా వీటిపై ప్రధానిని ఒప్పించాలని కవిత తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
