మోదీ సభకు ముందు నాపై కుట్ర.. కొడుకు మీద ఆరోపణలపై బండి సంజయ్ రియాక్షన్

 మోదీ సభకు ముందు నాపై కుట్ర.. కొడుకు మీద ఆరోపణలపై బండి సంజయ్ రియాక్షన్

తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ సోషల్ మీడియా ఎక్స్  వేదికగా స్పందించారు. ఇవన్నీ కుట్రపూరితమైన ఆరోపణలని కొట్టిపారేసిన ఆయన.. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు.

బండి సంజయ్ ఏమన్నారంటే.?  నా సుదీర్ఘ ప్రజా జీవితంలో నేను ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవిస్తూనే ఉన్నాను. భారత రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తున్నాను. దేశ న్యాయవ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. కుటుంబాన్ని లాగడం సరికాదు. రాజకీయ పోరాటాల్లోకి చిన్న పిల్లలను, కుటుంబ సభ్యులను లాగడం హీనమైన చర్య. నాతో నేరుగా రాజకీయంగా పోరాడే ధైర్యం లేని వారు.. తమ నిస్సహాయతతోనే ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు.. సాధారణ కార్పొరేటర్‌ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన ఒక బీసీ నాయకుడిని చూసి కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. నా ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్న వారి కుట్రలు సాగవు. రేపు(మే 10) ప్రధాని మోదీ భారీ సభ జరగనున్న తరుణంలో.. నా ప్రతిష్టను దెబ్బతీయడానికే పక్కా ప్రణాళికతో ఈ తప్పుడు ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ఏది సరైనదో, ఏది తప్పో న్యాయస్థానాలే నిర్ణయిస్తాయి. కాలమే అందరికీ సమాధానం చెబుతుంది. సత్యమేవ జయతే అంటూ బండి సంజయ్ తన పోస్ట్‌ చేశారు. 

►ALSO READ | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఫోక్సో కేసు : హనీట్రాప్ అంటూ తిరిగి కేసు ఫైల్

 ఓ మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో పెట్ బషీరాబాద్ పోలీసులు బండిసంజయ్ కొడుకుపై ఫోక్సో  కేసు నమోదు చేశారు. డిసెంబర్ 31న మొయినాబాద్‌లో తనపై అసభ్యంగా ప్రవర్తించారని, బలవంతంగా మద్యం తాగించే ప్రయత్నం చేశారని ఆ బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని  తెలిపింది. 

అయితే ఇదంతా హనీ ట్రాప్ అని .. ఓ మహిళ తన కూతురిని అడ్డుపెట్టుకుని ట్రాప్ చేసి సుమారు రూ. 2 నుంచి 3 కోట్లు  డిమాండ్ చేసిందని బండి సంజయ్ కొడుకు కరీంనగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.  డబ్బులు ఇవ్వకపోవడంతోనే బాలిక  ఫోక్సో కేసును అస్త్రంగా వాడుకుంటుందని  ఫిర్యాదులో తెలిపారు.