విజయ్ 24 గంటల అల్టిమేటం : జనంలోకి వెళ్తాను.. ఇలాంటోళ్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటేనే భయంగా ఉంది

విజయ్ 24 గంటల అల్టిమేటం : జనంలోకి వెళ్తాను..  ఇలాంటోళ్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటేనే భయంగా ఉంది

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం. టీవీకే పార్టీ చీఫ్ విజయ్ అల్టిమేటం ఇచ్చారు. 24 గంటల్లో సమస్య పరిష్కారం కాకపోతే.. జనంలోకి వెళ్తాను.. జనం దగ్గర తేల్చుకుంటాను అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. 

నేను పరిపాలించాలి.. సీఎం అయ్యి రాజులా ఉండాలని అనుకోవటం లేదు.. నేను ఎవరికీ బానిసగా ఉండాలని అని కూడా అనుకోవట్లేదు.. పదవి కోసం ఎవరి కాళ్లపై పడటానికి కూడా సిద్ధంగా లేను.. ప్రజల దగ్గరకే వెళ్తాను.. వాళ్ల దగ్గరే తేల్చుకుంటాను అంటూ పార్టీ ఎమ్మెల్యేలతో అన్నారు. 

ఎన్నికల్లో మెజార్టీ వస్తుందని ఆశించాను.. అందుకు కొంచెం తగ్గింది. కులం, మతం, అవినీతికి వ్యతిరేకంగా ఉండే నాలాంటి చిన్న పార్టీలు మద్దతు ఇస్తాయని ఆశించాను.. కమ్యూనిస్ట్ పార్టీలు ఏమీ ఆశించకుండానే.. పదవులు ఆశించకుండానే తమ మద్దతు ఇచ్చాయి అని స్పష్టం చేశారు విజయ్.

మద్దతు ఇస్తానని హామీ ఇచ్చిన తిరుమావళవన్.. అలివికాని షరతులు పెడుతున్నారు. అతను స్టాలిన్ సలహా మేరకు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది.. నాకు కూడా రాజకీయాల గురించి తెలుసు.. రాజకీయాలు తెలియకుండానే పార్టీ పెట్టానా ఏంటీ అంటూ కామెంట్ చేశారు విజయ్. 

జనం తీర్పుకు వ్యతిరేకంగా.. నాకు వ్యతిరేకంగా అందరూ ఏకం అవుతారని నేను ఊహించలేదు.. ఇది ఊహించని పరిణామం అంటూ విజయ్ తన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ముందే షరతులు విధించే వాళ్లు.. ప్రమాణ స్వీకారం చేశాక ఏం చేస్తారో అని తలచుకుంటేనే భయమేస్తుంది.. భయంగా ఉంది.. అసలు అలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు విజయ్. 

పార్టీ సమావేశంలో విజయ్ చేసిన కామెంట్స్ తమిళనాడు తీవ్ర చర్చకు దారి తీశాయి. విజయ్ అభిప్రాయంపై కొందరు సలహాదారులు సమావేశంలోనే స్పందించారు. 

ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని.. సమయం ఇంకా ఉందని.. మించిపోలేదని వారించినట్లు సమాచారం. ఇతర పార్టీల్లో మనస్సాక్షి ఉన్న వాళ్లు బయటకు వచ్చి మద్దతు ఇస్తారని.. అప్పటి వరకు వేచి చూద్దామని చెప్పినట్లు టీవీకే వర్గాలు స్పష్టం చేశాయి. 

టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వటం ఇష్టం లేకపోతే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను ప్రత్యర్థి పార్టీలు అన్నీ కలిసి తీసుకోవచ్చు కదా.. మనం ప్రతిపక్ష నాయకుడిగా మారొచ్చు.. అలా కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్న పార్టీపై కుట్రలు, కుతంత్రాలు చేయటం ఏంటంటూ కొందరు సలహాదారులు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. 

రెండు గంటలుసాగిన పార్టీ సమావేశంలో విజయ్ నుంచి ఆవేదన, ఆగ్రహం, అసహనం, అసంతృప్తి వ్యక్తం అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.