కోటి రూపాయలు కూడబెట్టాలని ఉందా..? ఈ రెండు పోస్టల్ స్కీమ్స్ బెస్ట్.. 100% సేఫ్ ప్లాన్ ఇదే

కోటి రూపాయలు కూడబెట్టాలని ఉందా..? ఈ రెండు పోస్టల్ స్కీమ్స్ బెస్ట్.. 100% సేఫ్ ప్లాన్ ఇదే

చాలామందికి కోటి రూపాయలు కూడబెట్టాలనేది లైఫ్ టైం డ్రీమ్. సామాన్య మధ్యతరగతి ప్రజలు దీనిని చేరుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇందుకోసం స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి రిస్క్ ఉన్న మార్గాల్లోనే వెళ్లాలని అనుకుంటారు. కానీ ఎటువంటి రిస్క్ లేకుండా ప్రభుత్వ గ్యారెంటీ కలిగిన పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD), రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్స్ కలయికతో కూడా రూ.కోటి కార్పస్‌ను సృష్టించవచ్చని మీకు తెలుసా? క్రమశిక్షణతో ఈ ఫైనాన్షియల్ గోల్ సామాన్యులు ఎలా సాధించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం వివరంగా..

కేవలం క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ద్వారా 20 ఏళ్లలో ఈ లక్ష్యాన్ని సురక్షితంగా చేరుకోవచ్చు. అదెలా అంటే.. ప్రస్తుతం పోస్టాఫీసు 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 7.5% వడ్డీని, అలాగే 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్‌పై 6.7% వడ్డీని అందిస్తోంది. ఈ రెండు స్కీమ్స్ కూడా 5 ఏళ్ల కాలపరిమితితో వస్తాయి. కానీ వీటిని మరో 5 ఏళ్ల పాటు పొడిగించుకునే సౌకర్యం ఉంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారికి ఇవి ఒక వరం.

మొదటి 10 ఏళ్ల పెట్టుబడి ప్లాన్:
ముందుగా ఇన్వెస్టర్లు రూ.10 లక్షల మొత్తాన్ని 5 ఏళ్ల పోస్టాఫీసు FDలో ఇన్వెస్ట్ చేసి, దానిని మరో 5 ఏళ్లకు పొడిగించాల్సి ఉంటుంది. అదే సమయంలో నెలకు రూ.10వేలు చొప్పున RDలో కూడా సమాంతరంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. FDలోని రూ.10 లక్షల పెట్టుబడి 10 ఏళ్ల తర్వాత దాదాపు రూ. 21లక్షల 02వేల 349 అవుతుంది. అలాగే RDలో  నెలకు రూ.10 వేల చొప్పున 10 ఏళ్లలో జమ చేసిన మొత్తం వడ్డీతో కలిపి రూ.17లక్షల 08వేల 546 అవుతుంది. దీంతో 10 ఏళ్ల ముగింపు నాటికి మెుత్తం ఇన్వెస్ట్మెంట్ సొమ్ము రూ.38 లక్షల 10వేల 895 అవుతుందన్నమాట.

కోటి రూపాయల లక్ష్యంలో పార్ట్-2:
మెుదటి 10  ఏళ్ల తర్వాత మీ దగ్గర ఉన్న రూ. 38లక్షల 10 వేలను మళ్లీ 5 ఏళ్ల FDలో పెట్టి దానిని పదేళ్ల పాటు రెవ్యూవల్ చేస్తూ కొనసాగించాలి. అలాగే నెలకు రూ.10వేల చొప్పున RD పెట్టుబడిని యధావిధిగా కొనసాగించాలి. దీంతో 20వ ఏట ఎఫ్ డి చేసిన డబ్బు మెుత్తం రూ.80 లక్షల 11వేల 832 అవుతుంది. ఇక ఇదే సమయంలో నెలకు రూ.10 వేల చొప్పున కట్టిన RD సొమ్ము రూ.17లక్షల 08వేల 546 అవుతుంది. ఈ రెండింటి నుంచి వచ్చిన మెుత్తాన్ని కలిపితే రూ. 97లక్షల 20వేల 378 అవుతుంది. అంటే దాదాపుగా కోటి రూపాయలు పోగవుతాయి. ఈ మెుత్తం జర్నీగా వాస్తవంగా మీరు ఇన్వెస్ట్ చేసిన అసలు కేవలం రూ.34 లక్షలు మాత్రమే కావటం గమనార్హం. ఈ ప్లాన్ మీరు ఎన్ని కోట్లు కావాలన్నా దానికి తగినట్లుగా పెట్టుబడి మెుత్తాన్ని మార్చుకుంటే సరిపోతుంది.

కోటి రూపాయల లక్ష్యం చేరిన తర్వాత.. ఈ మొత్తాన్ని 6% వార్షిక రిటర్న్స్ ఇచ్చే సురక్షితమైన ఫండ్లలో ఉంచితే.. మీరు సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా నెలకు దాదాపు రూ.68వేల 700 పెన్షన్ రూపంలో 20 ఏళ్ల పాటు పొందవచ్చు. మార్కెట్ రిస్క్ తీసుకోలేని రిటైర్డ్ వ్యక్తులకు,  మధ్యతరగతి ఇన్వెస్టర్లకు ఈ ప్లాన్ అత్యంత సురక్షితం. అంటే సేఫ్టీగా దాచుకున్న మెుత్తాన్ని చివరికి రిటైర్మెంట్ సమయంలో క్రమపద్ధతిలో పెన్షన్ మాదిరిగా కూడా పొందొచ్చు.