దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్ ఒకటి. ఇప్పుడు ఇదే కారు సరికొత్త 'హైడ్రోజన్' మోడల్ ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యపరిచింది. రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ప్రపంచం అడుగులు వేస్తున్న తరుణంలో.. ఆస్ట్రియన్ పవర్‌ట్రెయిన్ నిపుణులైన 'AVL టెక్నాలజీస్' సుజుకితో కలిసి ఈ స్విఫ్ట్ హైడ్రోజన్ ప్రోటోటైప్‌ను సిద్ధం చేసింది. భవిష్యత్తులో కాలుష్య రహిత ప్రయాణానికి ఇది దోహదపడనుందని ఆటో లవర్స్ అంటున్నారు.
కొత్త టెక్నాలజీతో స్విఫ్ట్..
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హైడ్రోజన్ కార్లు 'ఫ్యూయల్ సెల్' టెక్నాలజీని ఉపయోగిస్తాయి. కానీ ఈ స్విఫ్ట్ ప్రోటోటైప్ ప్రత్యేకమైనది. ఇది హైడ్రోజన్‌తో నడిచే 'ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్'ను కలిగి ఉంది. అంటే మనం వాడే పెట్రోల్ ఇంజిన్ తరహాలోనే ఉంటుంది దీని ఇంజిన్. కానీ ఇంధనం మాత్రం హైడ్రోజన్. ప్యాసింజర్ వాహనాలకు ఫ్యూయల్ సెల్ కంటే ఈ విధానం కొంచెం తక్కువ సమర్థవంతంగా అనిపించినప్పటికీ.. ఆర్థికంగా, ఆచరణాత్మకంగా ఇది ఎంతో మేలైనదని ఆటో నిపుణులు చెబుతున్నారు.
శక్తివంతమైన ఇంజిన్ పనితీరు..
ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన AVL టెక్నాలజీస్.. సెకండ్ జనరేషన్ స్విఫ్ట్ బాడీని ఉపయోగించి రూపొందించబడింది. ఇందులో 1.4 లీటర్ల డైరెక్ట్ ఇంజెక్షన్ హైడ్రోజన్ ఇంజిన్‌ను అమర్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇది సాధారణ పెట్రోల్ ఇంజిన్ కంటే ఎక్కువ శక్తిని ఇస్తుంది. ఈ ఇంజిన్ 134 hp పవర్, 220 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ మోడల్‌తో పోలిస్తే ఇందులో 13 hp పవర్, 20 Nm టార్క్ అదనంగా పెరగడం విశేషం. పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా.. పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా ఈ కారు తగ్గేదేలే అంటోంది.
నితిన్ గడ్కరీ విజన్..
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎప్పటి నుంచో భారతదేశంలో హైడ్రోజన్ వాహనాల అవసరం గురించి నొక్కి చెబుతున్నారు. ఇథనాల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైడ్రోజన్ కూడా భారత రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. గడ్కరీ స్వయంగా టయోటా మిరాయ్ అనే హైడ్రోజన్ కారును వాడుతూ ఈ టెక్నాలజీపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ మారుతి సుజుకి గనుక ఈ స్విఫ్ట్ హైడ్రోజన్ ప్రాజెక్టును భారీ స్థాయిలో ఉత్పత్తి దశకు తీసుకువెళితే.. ఇండియా క్లీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకోవడం మరింత సులభమవుతుంది.
►ALSO READ | లక్షల మంది క్రెడిట్ కార్డ్స్ డేటా లీక్: AI చేసిన కోడింగ్ మిస్టేక్‌తో చిక్కుల్లో హ్యాకర్లు.. ఏమైందంటే?
భారతదేశంలో స్విఫ్ట్ కారుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇష్టపడే ఈ కారు హైడ్రోజన్ వేరియంట్‌లో అందుబాటులోకి వస్తే.. దేశవ్యాప్తంగా హైడ్రోజన్ మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం అవుతుంది. అయితే ప్రస్తుతం ఇది కేవలం ఒక ప్రొటోటైప్ మాత్రమే. అంటే త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని చెప్పలేము కానీ.. భవిష్యత్తులో మన రోడ్లపై హైడ్రోజన్ స్విఫ్ట్ పరుగులు తీయడం ఖాయంగా కనిపిస్తోంది.
