లక్షల మంది క్రెడిట్ కార్డ్స్ డేటా లీక్: AI చేసిన కోడింగ్ మిస్టేక్‌తో చిక్కుల్లో హ్యాకర్లు.. ఏమైందంటే?

లక్షల మంది క్రెడిట్ కార్డ్స్ డేటా లీక్: AI చేసిన కోడింగ్ మిస్టేక్‌తో చిక్కుల్లో హ్యాకర్లు.. ఏమైందంటే?

సాధారణంగా AI పనులను సులభతరం చేస్తుందని అందరూ నమ్ముతారు. అదే ఏఐ ఒక క్రిమినల్ సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. దొంగిలించిన క్రెడిట్ కార్డులను పరీక్షించి విక్రయించే జెర్రీస్ స్టోర్ అనే ఒక డార్క్ వెబ్ మార్కెట్‌ప్లేస్.. ఏఐ జనరేట్ చేసిన లోపభూయిష్టమైన కోడింగ్‌ను నమ్మి అడ్డంగా బుక్కైపోయింది. దాదాపు 3లక్షల 45వేల పేమెంట్ కార్డుల వివరాలు నెట్టింట లీక్ అయ్యాయని సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు చెబుతున్నారు.

ఈ విచిత్రమైన ఘటన వెనుక ఉన్నది Cursor అనే ఏఐ కోడింగ్ అసిస్టెంట్. జెర్రీస్ స్టోర్ నిర్వాహకులు తమ సర్వర్ మౌలిక సదుపాయాలను, అంతర్గత డ్యాష్‌బోర్డులను నిర్మించడానికి ఈ ఏఐ టూల్‌ను ఉపయోగించారు. ముఖ్యంగా స్టాటిస్టిక్స్ డ్యాష్‌బోర్డ్ తయారు చేయమని ఏఐని కోరినప్పుడు, అది ఎటువంటి పాస్‌వర్డ్ రక్షణ, అథెంటికేషన్ లేని ఒక ఓపెన్ వెబ్ డైరెక్టరీని సృష్టించింది. దీనివల్ల ఇంటర్నెట్ ఉన్న ఎవరైనా ఆ సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేసే అవకాశం కలిగింది. సైబర్ నేరగాళ్లు చేసే తప్పులకు ఏఐ కూడా తోడవ్వడంతో వారి రహస్యాలన్నీ బయటపడ్డాయి.

లీక్ అయిన డేటాబేస్‌లో దాదాపు లక్షా 45వేల యాక్టివ్ క్రెడిట్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. డార్క్ వెబ్ మార్కెట్లో ఒక్కో కార్డు విలువ సుమారు 7 నుండి 18 డాలర్ల వరకు ఉంటుందని, అంటే లీక్ అయిన మొత్తం డేటా విలువ దాదాపు రూ. 21 కోట్లకు పైమాటే అని సైబర్ న్యూస్ పరిశోధకులు అంచనా వేశారు. ఈ కార్డుల్లో యూజర్ల పేర్లు, కార్డు నంబర్లు, గడువు ముగిసే తేదీలు, సీవీవీ కోడ్‌లు, అడ్రస్ వివరాలు కూడా ఉన్నాయి.

►ALSO READ | ఐపీఎల్ 2026లో ఫుడ్ వార్‌.. బిర్యానీని ఓడించి రికార్డ్ సృష్టించిన బర్గర్ ఆర్డర్స్

వ్యవహారం బయటపడటంతో ఆన్‌లైన్ ఫ్రాడ్ నెట్‌వర్క్‌లు ఎలా పనిచేస్తాయో కూడా వెలుగులోకి వచ్చింది. వీరు అమెజాన్, టెము, గ్రాబ్‌హబ్, లిఫ్ట్ వంటి ప్రముఖ వెబ్‌సైట్‌లను ఉపయోగించి దొంగిలించిన కార్డులతో చిన్న చిన్న లావాదేవీలు చేసేవారని వెల్లడైంది. ఒకసారి పేమెంట్ సక్సెస్ అయితే ఆ కార్డు పనిచేస్తుందని నిర్ధారించుకుని.. ఆపై ఇతర సైబర్ నేరగాళ్లకు వాటి వివరాలు అమ్మేసేవారట. ఇలాంటి చిన్న లావాదేవీలను బ్యాంకులు కూడా గుర్తించడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా డెవలపర్లు ఏఐ మీద అతిగా ఆధారపడి సెక్యూరిటీ చెక్ చేయకపోతే ఎంతటి అనర్థాలు జరుగుతాయో ఈ 'జెర్రీస్ స్టోర్' లీక్ బయటపెట్టింది. క్రెడిట్ కార్డ్ యూజర్లు తమ బ్యాంక్ స్టేట్‌మెంట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.