దేశీయ టెలికాం రంగంలో జియో రాక పెద్ద మార్పులకు దారితీసిన సంగతి తెలిసిందే. జియో ఎంట్రీతో బన్డిల్డ్ సర్వీసెస్ కాన్సెప్ట్ అమలులోకి వచ్చింది. అంటే నెట్, కాల్స్, మెసేజీలకు ప్రత్యేక రీఛార్జీల అవసరం లేకుండా పోయింది. దీంతో గతంలో మాదిరిగా చిన్న చిన్న మెుత్తాల్లో కాకుండా కనీసం రూ.200 పెట్టాల్సి వస్తోంది. ఇలాంటి టైంలో ఆత్రంగానో, తొందరలోనో ఒక నంబర్‌కు బదులు మరో నంబర్‌కు రీఛార్జ్ చేస్తే.. గుండె ఆగినంత పని అవుతుంది. పెట్టిన పైసలు గోవిందా అని బాధపడే రోజులు పోయాయి. తన కస్టమర్ల బాధను అర్థం చేసుకున్న రిలయన్స్ జియో.. తప్పుడు రీఛార్జ్ సొమ్మును వెనక్కి ఇచ్చే క్రేజీ ఆప్షన్‌ను తీసుకొచ్చింది తెలుసా.
ఈ ఛాన్స్ ఎవరికి అంటే?
ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ రీఫండ్ సౌకర్యం కేవలం రిలయన్స్ జియో కస్టమర్లకు మాత్రమే. అదీ కూడా రీఛార్జ్‌ను కేవలం MyJio యాప్ లేదా జియో అధికారిక వెబ్‌సైట్ ద్వారా చేసినోళ్లకే ఈ వెసులుబాటు ఉంటుంది. పొరపాటున ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా రీఛార్జ్ చేసి ఉంటే మాత్రం ఈ రీఫండ్ అవకాశం ఉండదని గుర్తుంచుకోండి.
స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే:
పొరపాటు జరిగిందని తెలిసిన వెంటనే ఆందోళన చెందకుండా ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి. ముందుగా మీ ఫోన్‌లోని MyJio యాప్‌ను ఓపెన్ చేసి మీ అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి. అందులో ట్రాన్సాక్షన్ హిస్టరీలో మీరు తప్పుగా చేసిన లేటెస్ట్ రీఛార్జ్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీకు Cancel Plan ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి. రీఛార్జ్ ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో కారణాన్ని పేర్కొని రిక్వెస్ట్ పంపాలి.
►ALSO READ | అదరగొట్టిన స్విఫ్ట్ హైడ్రోజన్ ఇంజిన్ వేరియంట్.. పెట్రోల్ కార్ కంటే పవర్ ఫుల్
ఈ క్రేజీ ఫీచర్‌లో ఉన్న అసలైన ట్విస్ట్ ఏంటంటే.. సమయం. పొరపాటున వేరే నంబర్‌కు రీఛార్జ్ చేసిన 3 గంటల లోపు మాత్రమే మీరు రీఫండ్ రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది. ఆ గడువు దాటితే మాత్రం జియో మీ రిక్వెస్ట్ అంగీకరించదు. మీరు రిక్వెస్ట్ పంపిన తర్వాత జియో టీమ్ దానిని వెరిఫై చేసి.. అది నిజంగానే తప్పుగా జరిగిన రీఛార్జ్ అని తేలితే కొన్ని గంటల్లోనే డబ్బు అకౌంట్‌కు వాపసు చేస్తుంది. సో ఇకపై జియో రీఛార్జ్ చేసేటప్పుడు నంబర్ తప్పు పడితే హైరానా పడకుండా స్మార్ట్‌గా MyJio యాప్ తో వెనక్కి పొందండి.
