ఈ వానాకాలం నుంచే పంట మార్పిడి.. రాష్ట్రంలో అవసరానికి మించి వరి సాగు

ఈ వానాకాలం నుంచే  పంట మార్పిడి.. రాష్ట్రంలో అవసరానికి మించి వరి సాగు
  • 2018–-19తో పోలిస్తే దాదాపు రెట్టింపు.. బియ్యానికి తగ్గిన డిమాండ్​
  • సేకరణకు ముందుకురాని కేంద్రం
  • కనీసం 30 శాతం వరి తగ్గించాలని ప్రభుత్వ నిర్ణయం
  • రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని ప్లాన్​
  • మే చివరి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ఏర్పాటు
  • పంట మార్పిడిపై చర్చించి నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అవసరానికి మించి సాగవుతున్న వరి విస్తీర్ణాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన రాష్ట్రంలో యేటా సగటున 2.80 కోట్ల టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి అవుతోంది. 4 కోట్ల జనాభాకు సుమారు 75 లక్షల టన్నుల ధాన్యం అవసరం. అంటే 1.80 కోట్ల టన్నులకు పైగా ధాన్యం మిగులుతోంది. 

కొంతకాలంగా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ఆర్డర్లు తగ్గిపోవడం, ఎఫ్​సీఐ ద్వారా బియ్యం సేకరణకు కేంద్రం మొండికేస్తుండడంతో గోడౌన్లలో నిల్వలు మూలుగుతున్నాయి. ఇలా మిగులుతున్న ధాన్యాన్ని ఏం చేయాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వం తలపట్టుకుంటోంది.

అదే సమయంలో రాష్ట్రంలో సరిపడా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, పండ్లు పండకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాబోయే వానాకాలం సీజన్​నుంచి వరి విస్తీర్ణాన్ని కనీసం 30శాతం మేర తగ్గించి, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రైతులపై ఒత్తిడి తేకుండా అవగాహన కల్పించేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మే చివరి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ఏర్పాటు చేసి, పంట మార్పిడిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నదనే వార్తలు ఆసక్తిరేపుతున్నాయి. 

రాష్ట్రంలో వరి సాగు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2018–19లో 68.64 లక్షల ఎకరాల్లో ఉన్న వరి సాగు 2025–26 నాటికి ఏకంగా 1.34కోట్ల ఎకరాలకు చేరుకుంటుందనే అంచనా ఉంది. ఉత్పత్తి విషయానికి వస్తే 2018–19లో 1.15 కోట్ల  మెట్రిక్ టన్నుల నుంచి 2025–26 నాటికి 2.86 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఓవైపు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అవుతుంటే, మరోవైపు కొంతకాలంగా దేశ, విదేశాల్లో బియ్యానికి డిమాండ్​ పడిపోతూ వస్తోంది. గతంలో మన బియ్యం పొరుగున ఉన్న తమిళనాడు, కేరళ,  కర్నాటక లాంటి రాష్ట్రాలతో పాటు వియత్నాం, థాయ్​లాండ్‌‌‌‌, పీలిప్పీన్స్​తదితర దేశాలకు ఎగుమతి అయ్యేవి. 

ఆయా రాష్ట్రాలు, దేశాల్లో వరి దిగుబడి పెరగడంతో రెండేండ్లుగా బియ్యం మార్కెట్​ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. దీనికితోడు ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగడంతో చాలా మంది బియ్యానికి బదులు చిరుధాన్యాలను ఆహారంగా వినియోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో  ధాన్యం సేకరణకు ఎఫ్‌‌‌‌సీఐ మొండికేస్తోంది. అదనంగా ఉత్పత్తి అయ్యే ధాన్యాన్ని కొనుగోలుచేసేందుకు ససేమిరా అంటోంది. దీంతో రాష్ట్ర గోదాముల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. ఇట్లా మిగిలిన ధాన్యాన్ని ఏం చేయాలో తెలియక రాష్ట్ర సర్కారు తలపట్టుకుంటోంది. పరిస్థితి  ఇలాగే ఉంటే మున్ముందు ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం రాష్ట్రసర్కారుకు సాధ్యం కాకపోవచ్చు. ఇదే జరిగితే  రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. 

అసెంబ్లీలో చర్చించాకే ముందుకు పంట మార్పిడి విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు మే చివరి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని  ప్రభుత్వం నిర్ణయించింది. రైతులపై ఒత్తిడి తేకుండా అవగాహన కల్పించే దిశగా కార్యాచరణ  సిద్ధం చేయాలని  భావిస్తోంది. ముందుగా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి, నీటిపారుదల సౌకర్యం, మట్టి స్వభావాన్ని బట్టి ఏయే మండలాలు ఏయే పంటలకు అనుకూలమో తేలుస్తారు. ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుందో లెక్కలతో సహా రైతులకు అవగాహన కల్పిస్తారు. ఆయా పంటలకు గిట్టుబాటు ధర లభించేందుకు ప్రభుత్వం భరోసా కల్పించనుంది.

ప్రభుత్వం కేవలం సూచనలకే పరిమితం కాకుండా, విత్తనాల నుంచి మార్కెటింగ్ వరకు ప్రతి దశలోనూ రైతుకు తోడుగా ఉండేలా కొన్ని చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా ప్రత్యామ్నాయ పంటలకు అదనపు ప్రోత్సాహకాలు అందించే అంశంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.  గతంలో జరిగిన పొరపాట్లను సమీక్షించుకుంటూ, ఈసారి శాస్త్రీయంగా ప్రత్యామ్నాయ పంటలను  ప్రోత్సహించడంపై దృష్టిపెట్టనున్నట్టు తెలిసింది. ఆయా పంటల సాగుకు అవసరమైన మౌలిక వసతులు, కోల్డ్ స్టోరేజ్​ల ఏర్పాటు, ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన వంటి అంశాలు ఈ సమావేశాల్లో చర్చకు రానున్నట్టు తెలిసింది.  

30 శాతం వరి తగ్గించాలి


వరి నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని ఇటీవల​ సీఎం రేవంత్​రెడ్డికి  సమర్పించిన నివేదికలో రైతు కమిషన్​ స్పష్టం చేసింది. వరి సాగుకు నీటి వాడకం ఎక్కువ. దీని  వల్ల భూగర్భ జలాలు పడిపోవడంతోపాటు విద్యుత్​సమస్య తీవ్రమవుతోందని, అలాగే భూములు నిస్సారమవుతున్నాయని హెచ్చరించింది.

విచ్చలవిడి ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతోందని అభిప్రాయపడింది. అందువల్ల పంట మార్పిడి కింద  నూనెగింజలు, పప్పుదినుసులు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు సాగుచేసేలా రైతులను  ప్రోత్సహించాలని సూచించింది.

ఆయా పంటలకు గల మార్కెటింగ్​ అవకాశాలను, ఎకరానికి వచ్చే నికర ఆదాయాన్ని పోల్చిచూసినప్పుడు వరి కంటే ప్రత్యామ్నాయ పంటలే లాభదాయకమని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని స్పష్టంచేసింది. ఇందుకు తగ్గట్టుగానే  ఈ వానకాలం నుంచి వరి విస్తీర్ణాన్ని కనీసం 20 నుంచి -30 శాతం తగ్గించి, ఆ స్థానంలో పంట మార్పిడిని అమలు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సర్కారు భావిస్తోంది. తద్వారా చిరుధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్ల రేట్లు కూడా సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తోంది.