చెన్నై: టీవీకే అధినేత విజయ్ సీఎం సీటులో కూర్చోవాలంటే వీసీకే పార్టీ ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. దీంతో.. అందివచ్చిన ఈ అవకాశాన్ని గట్టిగా వాడుకోవాలని వీసీకే డిసైడ్ అయింది. ఇద్దరు ఎమ్మెల్యేల అండదండలతో విజయ్ ముందు వీసీకే పార్టీ అధిష్టానం భారీగా డిమాండ్లు ఉంచింది.
ఇద్దరు ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలపాలంటే తమ పార్టీ చీఫ్ థోల్ తిరుమావళవన్కు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేయాలని, మరో మంత్రి పదవి కూడా ఇవ్వాలని, తిరుచ్చి ఈస్ట్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తమకే ఇవ్వాలని.. ఇలా పలు షరతులు విజయ్ ముందు ఉంచినట్లు వార్తలొచ్చాయి.
తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ వీసీకే పార్టీ.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 8 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 2 చోట్ల గెలిచింది. ఈ ఇద్దరు వీసీకే ఎమ్మెల్యేల మద్దతు ఇప్పుడు టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు కీలకంగా మారింది. ఇందులో ఒక ఎమ్మెల్యే పేరు వణ్ణి అరసు.
విల్లుపురం జిల్లాలో ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గమైన టిండివనం నుంచి వీకేసీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు వచ్చిన మెజారిటీ కేవలం 734 ఓట్లు మాత్రమే కావడం గమనార్హం. ఆయన తన సమీప ప్రత్యర్థి, అన్నాడీఎంకే అభ్యర్థి పి.అర్జునన్పై 734 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ నియోజకవర్గంలో టీవీకే మూడో స్థానంలో నిలిచింది. వీసీకే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు, టీవీకే అభ్యర్థికి మధ్య ఉన్న ఓట్ల తేడా 2వేల 674 ఓట్లు మాత్రమే.
ఇక.. మరో వీసీకే ఎమ్మెల్యే పేరు ఎల్.ఈ.జోతిమణి. కడలూరు జిల్లాలోని కాట్టుమన్నార్ కోయిల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ వీసీకే ఎమ్మెల్యే మాత్రం చెప్పుకోతగిన మెజారిటీతోనే గెలిచారు. పీఎంకే అభ్యర్థిపై 33 వేల 63 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపితే టీవీకే సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేస్తుంది. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి.
