వీడు మామూలోడు కాదు.. ఇది మామూలు క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ కాదు. ట్విస్టుల మీద ట్విస్టులతో పోలీసులకు అంతుచిక్కని మిస్టరీ కేసు ఇది. హంతకుడు పక్కనే ఉండి దర్యాప్తు చేయించిన వైనం. కుటుంబం మొత్తాన్ని లేపేసి.. మిస్సింగ్ కేసు పెట్టి.. పోలీసులకు చుక్కలు చూపించాడు. దృశ్యం సినిమాలో మాదిరిగా ఎవిడెన్స్ దొరకకుండా ఉండేందుకు చేసిన ప్లాన్ చూస్తే డిటెక్టివ్స్ కూడా శభాష్ అంటారు. కానీ చిన్న పొరపాటుతో దొరికిపోయాడు. కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఈ కేసు ఇప్పుడు వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. అక్షయ్ బీజే (27) అనే వ్యక్తి తన తల్లి, తండ్రి, సోదరి లను చంపి మిస్సింగ్ కేసు పెట్టి.. పోలీసులను మిస్ లీడ్ చేశాడు. తన తండ్రి భీమ్ రాజ్ , తల్లి జయలక్ష్మీ, సోదరి అమృత కనపడకుండా పోయారని కంప్లైట్ ఇచ్చాడు. ఆ తర్వాత కేసు ఎంత వరకు వచ్చిందని పోలీసుల చుట్టూ తిరుగుతూ చుక్కలు చూపించాడు. ఒక్క మిస్టేక్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.
ఒక ఫోన్ కాల్ ప్లాన్ అంతా రివర్స్ చేసింది..
మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకు దర్యాప్తు కష్టంగా మారిన పరిస్థితి. హంతకుడు గీసిన స్కెచ్ లోనే వెతుకుతున్న పోలీసులుకు ఎట్టకేలకు దొరికిన చిన్న క్లూ అనుకోకుండా పట్టించింది. సోదరి అమృత నంబర్ కు కానిస్టేబుల్ యాదృచ్ఛికంగా డయల్ చేయడంతో కేసు బయటపడింది. - ఆమె తప్పిపోయినప్పటి నుండి స్విచ్ ఆఫ్ అయిన ఫోన్.. కానిస్టేబుల్ డయల్ చేయడంతో అక్షయ్ ప్యాంటు జేబులోంచి మోగడం బండారం బయటపెట్టింది. దీంతో డౌట్ వచ్చిన కానిస్టేబుల్.. సార్, నేను అతని చెల్లి మొబైల్ కి రింగ్ ఇచ్చాను, ఇప్పుడు అది అతని జేబులోనే మోగుతోంది చెప్పడంతో.. అక్షయ్ ను చెక్ చేయగా..అతని తండ్రి, తల్లి, సోదరికి చెందిన మూడు సిమ్ కార్డులు దొరికాయి.
కేసు దర్యాప్తు చేస్తున్న తిలక్‌నగర్ పోలీసులు మొదటి నుంచీ ఏదో తప్పు జరుగుతోందని గ్రహించారు. అక్షయ్ ఒక్కోసారి ఒక్కో స్టోరీ చెబుతూ.. అనేక విషయాలపై మమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించాడు. మేము అతని కుటుంబ సభ్యుల నంబర్లకు డయల్ చేస్తూనే ఉన్నాం, అన్నీ స్విచ్ ఆఫ్ అయ్యాయి. కానీ జనవరి 30న, అక్షయ్ టీ తాగడానికి బయటకు వచ్చినప్పుడు, వారు బెంగళూరులో ఉన్నట్లు నమ్మించడానికి తన సోదరి ఫోన్‌ను ఆన్ చేశాడు. అక్కడే దొరికిపోయాడని జాయింట్ కమిషనర్ రమేష్ బానోత్ అన్నారు.
అసలు ఏం జరిగింది?
జనవరి 26న, విజయనగర్ కొత్తూరులోని తన ఇంట్లో అక్షయ్ ముగ్గురు కుటుంబ సభ్యులను హత్య చేశాడు. మధ్యాహ్నం మొదట తన తల్లిని చంపాడు. సాయంత్రం తన సోదరిని లేపేశాడు. ఆ రాత్రి ఆలస్యంగా, తన తండ్రిని హత్య చేశాడు. గొడ్డలితో వారి గొంతులు నరికి చంపేసి ముగ్గురి మృతదేహాలను బెడ్‌షీట్‌తో కప్పి ఆ రాత్రి అదే ఇంట్లో పడుకున్నాడు.
దృశ్యం లాంటి స్కెచ్..
ఫ్యామిలీ మెంబర్స్ ను చంపిన అక్షయ్.. ఆ తర్వాత ఎవిడెన్స్ దొరకుండా.. పోలీసులకు డౌట్ రాకుండా ఉండేందుకు దృశ్యం సినిమాను మించి ప్లాన్ చేశాడు. తన ఫోన్ ఇంట్లో పెట్టి.. ముగ్గురి ఫోన్లను తీసుకుని బెంగళూరుకు బయలుదేరాడు. ఇలా చేయటం వలన.. తన ఫోన్ ఇంట్లోనే ఉండటం వలన.. అక్షయ్ ఇంట్లోనే ఉన్నాడు.. కుటుంబ సభ్యులు బెగళూరు వెళ్లినట్లు పోలీసులు ట్రాక్ చేస్తే తెలుస్తుంది. అందుకే తన ఫోన్ ఇంట్లో వదిలి మరుసటి రోజు ఉదయం, బెంగళూరుకు KSRTC బస్సులో వెళ్లిపోయాడు.
బెంగళూరులో జయదేవ్ హాస్పిటల్ దగ్గర ఫోటోలు తీసి మూడు ఫోన్ల నుంచి తన నంబర్‌కు పంపాడు. తన తండ్రి వైద్య పరీక్ష కోసం సిటీకి వెళ్లినట్లు అభిప్రాయాన్ని కలిగించడానికి ఇంత ప్లాన్ చేశాడు. ఆ తర్వాత కొత్తూరుకు తిరిగి వచ్చి, డ్రిల్లింగ్ మెషిన్ ఉపయోగించి ఇంటి లోపల 10 అడుగుల లోతు గొయ్యి తవ్వి, ముగ్గురి మృతదేహాలను పాతిపెట్టాడు. తవ్వుతున్నప్పుడు సౌండ్ అర్థం కాకుండా ఉండేందుకు టీవీ ఫుల్ వాల్యూమ్‌లో పెట్టి గుంత తవ్వాడు. ఆ తర్వాత జనవరి 29న, బెంగళూరుకు తిరిగి వచ్చి, తన మామ వసంత్ తో కలిసి, తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టాడు.
అదుపులో నిందితుడు:
సినిమా స్టోరీని మించి అక్షయ్ చేసిన హత్య గురించి పూర్తిగా నిర్ధారించుకున్న పోలీసులు.. ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. సాక్ష్యాలను నాశనం చేయడానికి అక్షయ్‌కు సహాయం చేశాడని ఆరోపిస్తూ అతని మామ వసంత్‌ను కూడా అరెస్టు చేశారు.
ఇంట్లో పాతిపెట్టిన ముగ్గురి డెడ్ బాడీలను విజయనగర్ పోలీసులు గొయ్యి నుండి వెలికితీశారు. ఆపరేషన్ వీడియోలో రికార్డ్ చేశారు. అక్షయ్‌ను 10 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. అతని మామ వసంత్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
హత్యకు కారణం ఇదే..
హత్యకు కారణాలను కూడా పూటకో మాట చెప్పి పోలీసులను కన్ఫ్యూజన్ లో పడేశాడు నిందితుడు. తన చెల్లి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ (కులాంతర వివాహం) చేసుకుందని.. తమ పరువు తీసినందుకే అందరినీ చంపేశానని మొదట పోలీసులకు చెప్పాడు. కానీ అదితప్పు అని తేలటంతో.. ఆ తర్వాత విచారణలో అసలు నిజం బయటపెట్టాడు.
డబ్బు కోసమే కుటుంబాన్ని మొత్తాన్ని లేపేశాడు దుండగుడు.తన తండ్రి భీమ్ రాజ్ కు హరపనహల్లీలో కోటి 20 లక్షల విలువైన డూప్లెక్స్ హౌస్ ఉంది. బిజినెస్ చేస్తానని గత కొన్నాళ్లుగా డబ్బు కోసం తండ్రిని వేధిస్తున్నాడు. ఆ తర్వాత ఇల్లు అమ్మిన భీమ్ రాజ్... 50 లక్షల రూపాయలు తన కూతురు అమృత పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. మిగతా డబ్బులు తన దగ్గరే పెట్టుకున్నాడు. అక్షయ్ తాగుబోతు అని.. బాధ్యత లేకపోవడంతో ఉన్న ఆస్తులను కూడా లేకుండా చేస్తాడని ఈ పని చేశాడట తండ్రి.
తండ్రి డబ్బులు ఇవ్వకపోగా.. చెల్లెలి పేరున డిపాజిట్ చేయడంపై ఆగ్రహించిన అక్షయ్.. అందరినీ ఒకేసారి చంపేసి.. ఇన్ని డ్రామాలు ఆడాడు అని పోలీసుల విచారణలో తేలింది.
