దుబాయ్: అండర్-19 ఆసియా కప్ విజేతగా పాకిస్థాన్ నిలిచింది. టోర్నీ ఆసాంతం జైత్రయాత్ర సాగించిన భారత్ కీలకమైన చివరి పోరులో చేతులేత్తేసింది. దీంతో ఆదివారం (డిసెంబర్ 21) దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన పాకిస్థాన్ 191 పరుగుల భారీ తేడాతో ఇండియాపై గెలుపొందింది.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోర్ చేసింది. యువ బ్యాటర్ సమీర్ మిన్హాస్ (172) సెంచరీతో చెలరేగగా.. అహ్మద్ ఉస్సేన్ (57) హాఫ్ సెంచరీతో రాణించి జట్టుకు భారీ స్కోర్ అందించారు. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం 348 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 26.2 ఓవర్లలో156 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత యువ కెరటాలు వైభవ్ సూర్యవంశీ (22), అభిజ్ఞాన్ కుండు (13, కెప్టెన్ ఆయూష్ మాత్రే (2) సహా అందరూ విఫలం కావడంతో టీమిండియా కుర్రాళ్లకు ఓటమి తప్పలేదు. పాక్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లుతో ఇండియా పతనాన్ని శాసించగా.. మహ్మద్ సయ్యం, అబ్దుల్ సుభాన్, హుజైఫా అహ్సాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో టోర్నీ మొత్తం విజయాలతో దూసుకెళ్లిన ఇండియా కుర్రాళ్లు చివరి అంకంలో ఓడి ఒట్టి చేతులోనే నిరాశగా ఇంటి ముఖం పట్టారు.
