గుడ్ న్యూస్.. తెలంగాణలో రైతుల కోసం మరో డిస్కం.. మరింత సమర్థవంతంగా విద్యుత్ సరఫరా

గుడ్ న్యూస్.. తెలంగాణలో రైతుల కోసం మరో డిస్కం.. మరింత సమర్థవంతంగా విద్యుత్ సరఫరా

 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న మూడవ విద్యుత్ పంపిణీ సంస్థ రూపుదిద్దుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGRPDCL) ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ (TGSPDCL), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ (TGNPDCL) రెండు డిస్కంలు పనిచేస్తున్నాయి. లేటెస్టుగా మూడవ డిస్కంగా TGRPDCL ను బుధవారం, మార్చి 11, 2026న అధికారికంగా ఏర్పాటు చేశారు.  TGSPDCL కార్పొరేట్ కార్యాలయ ప్రాంగణంలోని B బ్లాక్ లో TGRPDCL  రిజిస్టర్డ్ కార్యాలయంగా ప్రభుత్వం పేర్కొంది.

ఈ కొత్త సంస్థ పరిధిలోకి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు (Lift Irrigation Schemes), CPWS / మిషన్ భగీరథ నీటి సరఫరా వ్యవస్థలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు (HMWSSB) పరిధిలోని కనెక్షన్లు, LT VI-B కేటగిరీ పరిధిలోని మునిసిపల్ నీటి సరఫరా కనెక్షన్లు TGRPDCL పరిధిలోకి రానున్నాయి:

TGRPDCL డిస్కం, వ్యవసాయం, CPWS/మిషన్ భగీరథ, HMWSSB, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, ప్రత్యేక DTRలు (LT VI-B) ద్వారా మునిసిపల్ నీటి కనెక్షన్లకు విద్యుత్ సరఫరా విస్తరణ, కేటాయించిన PPA వాటా ప్రకారం విద్యుత్ కొనుగోలు నిర్వహణ, కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల బోర్డింగ్ ప్రక్రియ నిర్వహణ, TGRPDCL పరిధిలోని ఆస్తులు (DTRలు , LT లైన్లు) నిర్వహణ, మెయింటెనెన్స్, లిఫ్ట్ ఇరిగేషన్, CPWS మరియు HMWSSB వంటి సంస్థల వినియోగ విద్యుత్‌ను DTR మీటరింగ్,  వినియోగదారుల మీటరింగ్ ద్వారా అకౌంటింగ్ చేయడం, అవసరమైన రెగ్యులేటరీ ఫైలింగ్స్,  నిబంధనల అనుసరణ వంటి ముఖ్య కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థలో సీఎండీగా పనిచేసిన అనుభవమున్న ముషారఫ్ ఫరూఖీ, ఐఏఎస్  TGRPDCL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. అలాగే రాష్ట్రంలోని దక్షిణ, ఉత్తర తెలంగాణ పంపిణి సంస్థల్లో డైరెక్టర్లుగా పనిచేస్తున్న వి. తిరుపతి రెడ్డి, పి. కృష్ణ రెడ్డి, శ్రీ వి. మోహన్ రావు , డా. ఎన్. నరసింహులు సంస్థ పాలక మండలి సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. TGRPDCL నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బందిని డెప్యూటేషన్, ప్రత్యక్ష నియామకాలు లేదా అవుట్‌సోర్సింగ్ విధానం ద్వారా సమకూర్చుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.