తెలంగాణలో పెరిగిన మెడికల్ సీట్లు.. ఇకపై వైద్య విద్యార్థులకు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసెస్

తెలంగాణలో పెరిగిన మెడికల్ సీట్లు.. ఇకపై వైద్య విద్యార్థులకు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసెస్

తెలంగాణలో వైద్య విద్య వేగంగా మారుతోంది. జిల్లా కేంద్రాల్లో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, రిజర్వేషన్ సంస్కరణల ఫలితంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 61 మెడికల్ కాలేజీల్లో దాదాపు 9వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మెడికల్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే దీని వెనుక ఒక నిశ్శబ్ద పోరాటం దాగి ఉంది. తెలుగు మీడియం నుండి వచ్చి.. ప్రతిభతో మెడికల్ సీట్లు సాధించిన గ్రామీణ విద్యార్థులు.. ఇంగ్లీష్ అర్థం చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ, మెడికల్ విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని మొదటి, రెండో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీని ద్వారా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తెలుగు మీడియం చదివిన విద్యార్థులు కూడా ముందుకు సాగేందుకు వీలు కలుగుతుందని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. 

ఎందుకు ఈ నిర్ణయం?
చాలామంది గ్రామీణ విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులతో మెడికల్ సీట్లు పొందుతున్నప్పటికీ.. తరగతి గదిలోకి వెళ్లగానే ఇంగ్లీష్ మీడియం బోధన, సంక్లిష్టమైన మెడికల్ టెర్మినాలజీ చూసి ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో వారు పాఠాలు అర్థం కాక లోన్సీగా ఫీల్ అవుతున్నారు. కొందరు చదువును మధ్యలోనే ఆపేయటం, మరికొందరు పరీక్షల్లో వెనుకబడటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ప్రభుత్వం దీనిని పరిష్కరించేందుకు భాషా నైపుణ్యాలను కూడా పెంపొందించాలని నిర్ణయించింది. గ్రామీణ విద్యార్థుల్లో నైతిక ధైర్యాన్ని నింపటమే దీని వెనుక లక్ష్యంగా ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. 

ప్రస్తుతం నర్సింగ్ కాలేజీల్లో విజయవంతంగా నడుస్తున్న మోడల్ ఆధారంగా ఈ శిక్షణను రూపొందిస్తున్నారు. దీనిని 2026 విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. ఇది కేవలం భాషా శిక్షణ మాత్రమే కాకుండా, విద్యార్థుల్లో రీసెర్చ్ క్లిల్స్ మెరుగుపరచడానికి కూడా ఇది దోహదపడుతుంది. ఈ నిర్ణయంపై వైద్య వర్గాల నుంచి కూడా హర్షం వ్యక్తం అవుతోంది. తాను కూడా ఇంటర్ తెలుగు మీడియం చదివి 2009లో ఎంబీబీఎస్ సీటు సాధించానని ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎం. రాజీవ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను కూడా ఇలాంటి భాషా పరమైన మార్పు ఒత్తిడికి గురైనట్లు చెబుతూ ఇకపై గ్రామీణ విద్యార్థులకు వైద్య విద్య కల దూరం కాదని భరోసా ఇచ్చారు.