ముంబై: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026ను టీమిండియా విజయంతో ప్రారంభించింది. బ్యాటింగ్‌లో సూర్య కుమార్ యాదవ్ (84) వీరోచిత పోరాటంతో పాటు బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లతో రాణించడంతో శనివారం (ఫిబ్రవరి 7) ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో అమెరికాపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల కోల్పోయి 161 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 20, తిలక్ వర్మ 25 పర్వాలేదనిపించారు. అమెరికా బౌలర్లలో వాన్ షాల్క్విక్ 4 వికెట్లతో టీమిండియాను దెబ్బకొట్టాడు. అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 రన్స్ చేసింది.
ఇండియాకు ఆదిలోనే అమెరికా ఝలక్:
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు అమెరికా ఆరంభంలోనే షాక్ ఇచ్చింది. భీకర ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. తొలి బంతికే భారీ షాట్ ఆడబోయి అలీ ఖాన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (20), తిలక్ వర్మ (25) పర్వాలేదనిపించారు. శివమ్ దూబే డకౌటై తీవ్ర నిరాశ పర్చాడు.
ఒక వైపు వికెట్లు పడుతున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్సింగ్స్‌తో టీమిండియాను ఆదుకున్నాడు. సూర్య (85) అద్భుత హాఫ్ సెంచరీతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ చేసింది. అమెరికా బౌలర్లలో వాన్ షాల్క్విక్ 4 వికెట్లతో టీమిండియాను దెబ్బకొట్టాడు. హర్మీత్ సింగ్ 2 తీయగా.. అలీ ఖాన్, మహమ్మద్ మోసిన్ చెరో వికెట్ పడగొట్టారు.
రాణించిన భారత బౌలర్లు:
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికాకు శుభారంభం లభించలేదు. టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆదిలోనే అమెరికాను దెబ్బకొట్టాడు. యూఎస్ ఓపెనర్లు ఆండ్రీస్ గౌస్ (6), సాయి తేజ ముక్కమల్లను (2) తక్కువ పరుగులకే పెవిలియన్ పంపాడు.
మిలింద్ కుమార్ (34), సంజయ్ క్రిష్ణమూర్తి (37), శుభం రన్ జానే (37) పరుగులతో గెలుపు కోసం పోరాటం చేశారు. కానీ టీమిండియా కట్టుదిట్టం బౌలింగ్ చేయడంతో అమెరికా ఓటమి పాలైంది. భారత బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా.. అర్షదీప్, అక్షర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశాడు.
