సుల్తానాబాద్: చైల్డ్ హోం నుంచి పరారైన బాలికలు క్షేమం

సుల్తానాబాద్: చైల్డ్ హోం నుంచి పరారైన బాలికలు క్షేమం

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కండేయ కాలనీలోని చైల్డ్ హోం నుంచి పరారైన ఇద్దరు బాలికల ఆచూకీని గుర్తించి  పోలీసులు క్షేమంగా తీసుకొచ్చారు. డీసీపీ రాంరెడ్డి సుల్తానాబాద్ లోని చైల్డ్ హోంలో గురువారం వివరాలు వెల్లడించారు. 9, 4వ వ తరగతి చదివే ఇద్దరు బాలికలు కలిసి బుధవారం తెల్లవారుజామున చైల్డ్ హోం కాంపౌండ్ వాల్ దూకి పరారైన విషయం తెలిసిందే.  స్థానిక చౌరస్తా నుంచి ఆటోలో పెద్దపల్లి రైల్వే స్టేషన్ కు వెళ్లి అక్కడి నుంచి రైలులో భువనగిరికి చేరుకున్నారు. 

అనంతరం బస్సులో నల్గొండకు వెళ్లినట్టు గుర్తించారు. నల్గొండ బస్టాండ్ లో ఉన్న ఈ బాలికలను బుధవారం రాత్రి పోలీసులు గుర్తించి అక్కడి బాలసదనంలో ఉంచారు. గురువారం సుల్తానాబాద్ చైల్డ్ హోం కు తరలించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రయాణ మార్గాల ద్వారా బాలికలను, ఇక్కడ నుండి వెళ్లిన 12 గంటల్లోనే గుర్తించినట్టు డీసీపీ తెలిపారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ రంజిత్ రావు, ఎస్సై చంద్రకుమార్, హెచ్ సీ మహేందర్, పీసీలు వెంకటేష్, రవి, రమేష్, అరుణ్, సదానందం, రేణుక తో పాటు టెక్నికల్ టీం మెంబర్లను డీసీపీ అభినందించి నగదు ప్రోత్సాహకం అందజేశారు.