అబిడ్స్, వెలుగు: కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. 2022 ఏప్రిల్ 1న భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా విలేకరుల సమావేశం నిర్వహించారనే ఆరోపణలపై నమోదైన కేసు విచారణలో భాగంగా ఆయన కోర్టుకు వచ్చారు.
ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన మరో ఆరుగురు కాంగ్రెస్ నేతలు హాజరుకాకపోవడంతో వారికి కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ప్రధాన నిందితుడైన భట్టి విక్రమార్కను సెప్టెంబర్ 3న ఇద్దరు పూచీకత్తుదారులతో హాజరుకావాలని, రూ.10 వేల చొప్పున పూచీకత్తు సమర్పించాలని కోర్టు సూచించింది.
