కరీంనగర్: ఉత్తర తెలంగాణ జిల్లాలో గురువారం భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో.. ఉత్తర తెలంగాణ జిల్లాలను అప్రమత్తం చేస్తూ.. IMD రెడ్, ఆరెంజ్, ఎల్లో కలర్ వార్నింగ్స్ ఇష్యూ చేసింది.
ఈ రోజు (గురువారం) 5 జిల్లాలకు అత్యంత భారీ వర్షం కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు అత్యంత భారీ వర్షాల ముప్పు ఉందని రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 12 జిల్లాలకు భారీ వర్ష సూచనతో.. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, జనగాం, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
మంచిర్యాల జిల్లాలో కడెం ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద తాకిడి పెరుగుతుందని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎగువన, దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పశువుల కాపర్లు, మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని అయినం గ్రామం వరద నీటితో పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది.
గ్రామాన్ని చుట్టుముట్టి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయినం మార్గంలోని లో-లెవల్ వంతెనలపై వరద ఉధృతి కొనసాగుతుండటంతో సుమారు 12 గ్రామాలకు రవాణా స్తంభించింది. అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు.
