న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకొని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారాలని సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అన్నారు. విద్యార్థులను వేధించడం ఆపకపోతే మరింత పెద్ద ఉద్యమం చేస్తామని, అవసరమైతే ప్రభుత్వాన్నే మార్చేలా ప్రజలు తీర్పు ఇస్తారని హెచ్చరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మహారాష్ట్రలోని తన స్వగ్రామానికి వెళ్లిన దీప్కే అక్కడ మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో విద్యార్థులకు సందేశాలు ఇస్తున్న మోదీపై వ్యంగ్యంగా స్పందించారు.
‘‘మోదీ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా బాగా చేస్తున్నారు. ఆయన ప్రధాని పదవిని మరో నాయకుడికి ఇవ్వాలి’’ అని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థుల ఆగ్రహం తగ్గలేదని చెప్పారు. ప్రజల కోపం ఒక మంత్రిపై కాదని, ప్రభుత్వంపైనేనని అన్నారు. యువత ఆవేదనను బీజేపీ అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు.
పేపర్ లీక్ కేసుల కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించినా, తొలి విచారణే సీబీఐ న్యాయవాది హాజరుకాక వాయిదా పడిందని గుర్తు చేశారు. ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండడంలేదన్నారు.
