హైదరాబాద్: 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలో ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్ధిని నిలబెడతానని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం (ఫిబ్రవరి 7) జగిత్యాలలో ఎంఐఎం అభ్యర్థి తరుఫున అసదుద్దీన్ ఓవైపీ క్యాంపెయినింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల తర్వాత జగిత్యాలకు వచ్చానని అన్నారు.
ఉర్దూ హౌస్ బిల్డింగ్ పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. జగిత్యాల గంజ్ ప్రాంతంలో నాలా సమస్య, ఉర్దూ హౌజ్ ఏర్పాటుపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని అన్నారు. రాజకీయంగా ఏ పార్టీ కూడా ముస్లింలకు నాయకత్వం ఇవ్వలేదని.. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ముస్లిం సమస్యలపై పార్లమెంట్లో ఎప్పుడు ప్రస్తావించలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీలోనే సంజయ్, జీవన్ రెడ్డిలు ఇద్దరూ కొట్లాడతున్నారని.. వీళ్లు ఇక బీజేపీతో ఎప్పుడు కొట్లాడతారని ఎద్దేవా చేశారు. 2028 ఎన్నికల్లో జీవన్ రెడ్డి లేదా సంజయ్ కేసీఆర్ దగ్గరికి వెళ్తారని చెప్పారు. హైదరాబాద్‌లో మోడీ, అమిత్ షాలు ప్రచారం చేస్తే బీజేపీ గెలవలేదని.. ఇక జగిత్యాలలో బీజేపీ ఎలా గెలుస్తుందన్నారు.
ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశంలో మతకలహాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. లడక్‌లో జరిగిన గొడవలను బీజేపీ ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ప్రధాని మోడీ తొలగిస్తారని ఆరోపించారు.
